సామాజిక సాధికారిత ద్వారా తీర ప్రాంత అభివృద్ధి
-ఎంపి డాక్టర్ సీఎం రమేష్
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 5:
గత డిసెంబర్ లో జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో రూల్ 377 అంశంగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ పూడిమడక వద్ద ఫిషింగ్ హార్బర్ ను సకాలంలో పూర్తి చేయాలని లోక్ సభలో చర్చించిన అంశంపై స్పందిస్తూ కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ మంత్రి లేఖ వ్రాశారు.
పూడిమడక వద్ద మత్స్య ప్రాజెక్టు సకాలంలో అభివృద్ధి చేస్తే ఆర్ధిక అవకాశాలు పెరగడంతోపాటు, ఆహార భద్రత మెరుగుపడి, సామాజిక సాధికారతను పెంపొందించి తీర ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రమేష్ అన్నారు.సాగర మాల పథకం క్రింద సముద్రతీర ప్రాంత ప్రజల అభివృద్ధికి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ అన్నివిధాల సహయ సహకారాలు అందిస్తుంది అని, అక్కడి ప్రజల ఆర్ధికాభివృద్ధికి కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి సర్బానంద సోనొవాల్ తన లేఖలో ప్రస్తావించారు.
కేంద్ర మత్స్య శాఖ, అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సాగరమాల పథకం కింద చేపట్టిన అనకాపల్లి జిల్లాలోని పూడిమడక ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టుకు సాగర్ మాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటికే నలభై కోట్ల రూపాయల ఆర్థిక నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసిందని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తదుపరి అభ్యర్ధనల వచ్చిన తరువాత అవసరమైన చర్యలను తీసుకుని ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని సముద్ర తీర సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిరంతర మద్దతుకు,విలువైన సూచనలకు ఎంపీ రమేష్ ధన్యవాదాలు తెలియజేశారు.