Sidebar


Welcome to Vizag Express
నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి పి-4 మోడల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్

06-02-2025 21:37:37

నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి పి-4 మోడల్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ 

శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 6 :
 నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి 'పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్' (పి-4) ఒక కీలకమైన సాధనమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ పేర్కొన్నారు. సచివాలయం నుంచి గురువారం సాయంత్రం ఆయన జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లోమాట్లాడుతూ, ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధిని సాధించగలదని అన్నారు. పి -4 ప్రాముఖ్యతను ఆయన వివరిస్తూ, ఇది వనరుల సద్వినియోగానికి, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతుందని, ప్రజల భాగస్వామ్యం, జవాబుదారీతనం పెంచుతుందని తెలిపారు. పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, ఇతర సామాజిక సేవలలో మెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక, వ్యవసాయాభివృద్ధి వంటి లక్ష్యాలను పి -4 ద్వారా సాధించవచ్చని అన్నారు. 
 జిల్లా కలెక్టర్లు వారి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక జిల్లా అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని, వారు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి విజన్ యాక్షన్ ప్లాన్ తయారీ, అమలులో పని చేస్తారని చెప్పారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో నోడల్ అధికారికి సహాయంగా ఆరుగురు సభ్యుల బృందం ఉంటుందని, ఈ బృందంలో గ్రామ సచివాలయాల నుండి ఐదుగురు, స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒక యువ నిపుణుడు ఉంటారనీ చెప్పారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయా అధికారులకు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ, జిల్లాలో  పి-4 ప్రణాళిక అమలుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో సీపీవో ప్రసన్నలక్ష్మి, డిపీవో భారతి సౌజన్య, జెడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, పరిశ్రమల శాఖ జిఎం ఉమామహేశ్వరరావు తదితరులు హాజరయ్యారు