బాబూ... ఏది ఆ డాబు
- తొమ్మిది నెలల్లో అప్పుల్లో రికార్డ్
.క్యాంప్ ఆఫీస్‌లో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
తాడేపల్లి, వైజాగ్ ఎక్స్ ప్రెస్; ఎన్నికల ముందు, చంద్రబాబుగారి నోట మాట ఏమిటంటే.. బాబు ష్యూరిటీ. భవిష్యత్తు గ్యారెంటీ. కానీ, ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే.. బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ అన్నట్లుగా మారిందనీ మాజీ సిఎం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ అన్నాడు... మ్యానిఫెస్టోలో 143 హామీలు ఇచ్చి, ఇంటింటికీ ప్రచారం చేశారు. ఇంకా ఆ హామీలకు గ్యారెంటీ అంటూ బాండ్లు చూపారు. ఇంటింటికీ పంచారు. అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోమన్నారు. నిలదీయమన్నారు, అప్పుడు మీరిచ్చిన బాండ్లు ఏమయ్యాయి? మ్యానిఫెస్టో ఏమైంది? పంచిన పాంప్లెంట్లు ఏమయ్యాయి? ఎవరి చొక్కా పట్టుకోవాలనీ ప్రశ్నించారు.
రికార్డు స్థాయిలో అప్పులు...
మరోవైపు రాష్ట్ర అప్పులు ఈ 9 నెలల్లోనే రికార్డుల బద్ధలు కొట్టాయి. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో అప్పులు చేయలేదు. 9 నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే రూ.80,827 కోట్లు అని ఎద్దేవా చేశారు. అప్పులన్నీ కలిపితే ఇప్పటికే చేసిన, తెస్తున్న అప్పులు ఏకంగా రూ.1.45 లక్షల కోట్లకు పైగానే. ఇది నిజంగా రికార్డు. ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు అని అన్నారు.
పథకాలన్నీ పాయే..
పిల్లల చదువుల కోసం ఇచ్చిన అమ్మ ఒడి పాయే.. రైతు భరోసా పథకం పాయే.. వసతి దీవెన పాయే.. విద్యా దీవెన అరకొర. చేయూత లేదు. ఆసరా లేదు. సున్నా వడ్డీ, ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎగనామమే. వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేదోడు, తోడు, లా నేస్తం... గతంలో ఉన్న పథకాలన్నీ పాయే.. పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చే పథకం కూడా పాయే.. నేను అడుగుతున్నా. రూ.1.45 లక్షల కోట్ల అప్పులు. చేసినవి. చేస్తున్నవి. ఎవరి జేబులోకి పోతున్నాయి అని ప్రశ్నించారు.
ఉద్యోగాలు లేవు. ఉన్నవే ఊడగొట్టారు
ఈ 9 నెలల కాలంలో కొత్త ఉద్యోగాలు లేకపోగా, ఉన్న ఉద్యోగాలే ఊడగొట్టారు. 2.60 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు ఊడగొట్టాడు. 18 వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగాలు పాయే.. ఫైబర్‌నెట్, ఏపీఎండీసీ, ఫీల్డ్ అసిస్టెంట్స్, వైద్య ఆరోగ్య శాఖ.. ఆయా విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు తీసేశారనీ ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అన్నాడు. ఉన్న పీఆర్‌సీ ఛైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించారు. కొత్త పీఆర్‌సీ వేయలేదనీ, ఒకటో తేదీనే జీతాలు అన్నాడు. ఒకే ఒక నెల మాత్రమే ఇచ్చాడు. తర్వాత ఏనాడూ ఇవ్వలేదనీ, మూడు డీఏలు పెండింగ్. ట్రావెల్ అలవెన్స్‌లు, సరెండర్ లీవ్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్.. అన్నీ పెండింగ్. చివరకు ఉద్యోగస్తులకు సంబంధించిన జీఎల్‌ఐ, జీపీఎఫ్ కూడా తాను వాడేస్తున్నాడు.రాష్ట్రంలో ఇదీ పరిస్థితి. ఆర్థిక విధ్వంసం అంటే ఇదీ అని అన్నారు.
రాష్ట్ర సంపద అమ్మేస్తున్నారు
– సొంత వనరులు పెరిగేలా, ఆదాయాలు పెరిగేలా.. పోర్టు బేస్‌డ్ ఇండస్ట్రియలైజేషన్ దిశగా.. మా ప్రభుత్వ హయాంలో ఏకంగా నాలుగు పోర్టుల నిర్మాణం చేపట్టాం. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం ఈ మూడు ప్రభుత్వ రంగంలో కట్టడం మొదలుపెట్టి.. వాటిలో రామాయపట్నం పనులు దాదాపు 75 శాతం పూర్తి చేశాం. ఎన్నికల కోడ్ రాకుండా ఉండి ఉంటే, మా హయాంలోనే మొదటి షిప్ కూడా వచ్చేది. మూలపేట, మచిలీపట్నం పోర్టుల పనులు కూడా చాలా వేగంగా జరిగాయి. దాదాపు 40 శాతం పనులు పూర్తయ్యాయనీ గుర్తు చేశారు.
17 కొత్త మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెట్టారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా 17 మెడికల్ కాలేజీల పనులు మొదలు పెట్టి, వాటిలో 5 కాలేజీలను ప్రారంభించాం. మరో 5 మెడికల్ కాలేజీలు ఈ ఏడాది ప్రారంభం కావాల్సి ఉంది. పనులు కూడా జరిగాయన్నారు.
అంతా స్కామ్‌లమయం...
చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. దానర్థం. తన ఆస్తులు పెంచుకోవడం. తన వారి ఆస్తులు మాత్రం పెంచుకోవడం. ఈరోజు ఇసుక స్కామ్. గతంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఈరోజు ఒక్క రూపాయి రావడం లేదు. మరోవైపు గతంలో అమ్మిన రేటు కంటే డబుల్ రేటుకు అమ్ముతున్నారు.అంటే సంపద సృష్టి చంద్రబాబు జేబులో జరుగుతోంది. రాష్ట్ర ఆదాయం ఆవిరై పోతోందనీ మండి పడ్డారు.