Sidebar


Welcome to Vizag Express
విగ్రహ ప్రతిష్ట నిలిపివేత చర్య పై మాజీ ఎమ్మెల్యే సత్తి ఆగ్రహం

07-02-2025 22:26:29

విగ్రహ ప్రతిష్ట నిలిపివేత చర్య పై మాజీ ఎమ్మెల్యే సత్తి ఆగ్రహం 

అనపర్తి, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి7:అనపర్తి శివారు కొత్తూరు జగనన్న కాలనీలో వైసిపి సానుభూతిపరుడు సత్తి గంగిరెడ్డి తన సొంత ఖర్చుతో ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో ఆక్రమణ స్థలంలో అక్రమ కట్టడాలు అంటూ ప్రభుత్వ అధికారులు నోటీసులు జారీ చేసి విగ్రహ ప్రతిష్ట నిలిపి వేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేడు (శుక్రవారం) విగ్రహ ప్రతిష్టకు సుమారు 6 వేల మంది భక్తులను ఆహ్వానించి భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని ఇటువంటి సమయంలో విగ్రహ ప్రతిష్ట అడ్డుకోవడం దారుణమని విమర్శించారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే హిందూ దేవాలయం చుట్టూ కంచే వేసి ఇప్పుడు కనీ విని ఎరగని రీతిలో విగ్రహ ప్రతిష్ట జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే సత్తి ధ్వజమెత్తారు. సుమారు ఐదారు నెలలుగా నిర్మాణం జరిగినప్పుడు అధికారులు అప్పుడు ఎందుకు అడ్డుకోలేదని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. హిందూ దేవాలయాలకు ఏమాత్రం అపచారం, డామేజ్ జరిగిన హిందుత్వ సంఘాలు స్పందించడం జరుగుతుందని ఇప్పటికే కొంతమంది స్పందించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దురుద్దేశంతో పోలీసు బలగాలను అడ్డుపెట్టుకుని ఈ వ్యవహారం జరిపించడం సరికాదని సుమారు రూ. 20 లక్షలతో ఈ ఆలయాలు నిర్మించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. ఇదే విధంగా కొనసాగితే స్థానిక ప్రజల్లో ఏవిధంగా తిరుగుబాటు వస్తుందో త్వరలో మీరే చూస్తారని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా విగ్రహాలను గ్రామంలోకి తీసుకురావడం జరిగిందని ఆ విగ్రహాలను అలా వదిలేయడం వల్ల గ్రామానికి కూడా అరిష్టమని మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన బిజెపి నేతలు ఆలయ విగ్రహ ప్రతిష్ట నిలిపివేయడం ఏమాత్రం మంచిది కాదని మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.