కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 7, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద 1456వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో స్టీల్ సిఐటియు ప్రతినిధులు మరియు కార్మికులు పాల్గొన్నారు.
వీరిని ఉద్దేశించి జిల్లా సిఐటియు నాయకులు ఎన్ రామారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కర్మాగారం పై సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని ఆయన అన్నారు. స్టీల్ మంత్రి ఇక్కడకు విచ్చేసి 35 వేల కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు అప్పు ఉన్నారని ఆయన అన్నారు కానీ ఇదే ప్రశ్నను పార్లమెంట్ సభ్యులు అడిగితే 38684 కోట్లు ఉన్నారని చెప్పారు. దీనికి ప్రధాన కారణం ముడి ఇనుప ఖనిజం బయట మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తే వచ్చే నష్టమని ఆయన వివరించారు. కనుకే స్టీల్ నిపుణులు విశాఖ ఉక్కు కు సొంత ఇనుప ఖనిజం గనులను కేటాయించడం ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్న ప్రభుత్వం వైఖరి మాత్రం చెమిటి వాని ముందు శంఖం ఊదిన చందంగా నే ఉందని ఆయన వివరించారు. అలాగే నేడు 31 లక్షల టన్నుల హాట్ మెటల్ రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేసిన స్టీల్ కార్మికులకు గడచిన ఐదు మాసాలుగా పూర్తి జీతాలు చెల్లించని స్టీల్ యాజమాన్యాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. కార్మికుల మొరేల్ ను దెబ్బతీస్తున్న స్టీల్ యాజమాన్యం వైఖరిని గుర్తింపు సంఘం ప్రశ్నిస్తూ యాజమాన్యంపై ఒత్తిడి చేస్తూ కార్మికుల జీతాలు ఇప్పించే ప్రక్రియ నిరంతరం కొనసాగాలని ఆయన వివరించారు. కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు అవసరమైన చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత ఒత్తిడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గుర్తింపు సంఘం తన బాధ్యతను నిర్వహించలేని తరుణంలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ద్వారా యాజమాన్యంపై ఒత్తిడి చేయడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ సమయంలో కార్మికులకు కార్మిక సంఘాలకు మధ్య వైరాన్ని సృష్టించే ప్రక్రియను మరింత వేగంగా స్టీల్ యాజమాన్యం ప్రభుత్వాలు నిర్వహిస్తాయని ఆయన అన్నారు. కనుక ఈ సమయంలో కార్మిక వర్గం కార్మిక సంఘాలపై భరోసాతో ఐక్య ఉద్యమాల ద్వారా వీటిని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు కె గంగాధర్, భానుమూర్తి, జగ్గారావు, రామ్మోహన్ కుమార్, విజయ్ కుమార్, కె సత్యనారాయణ, డిసిహెచ్ వెంకటేశ్వరరావు, కె అప్పారావు తదితరులతో పాటు కార్మికులు పాల్గొన్నారు.