ఆగని ఎర్రచందనం ... పవన్ హడావుడి ఏమైంది...?
- తాజాగా అన్నమయ్య జిల్లాలో
రూ.4.20 కోట్ల విలువైన దుంగలు స్వాధీనం
- అటవీ శాఖామంత్రి తమరే కదా ... అరిట్టరెందుకో?
-పక్క మంత్రిపై చిందులు తొక్కిన సారూ...ఇప్పుడేమంటారు?
విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్; వైసీపీ హయాంలో విచ్చలవిడిగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారని జనసేన అధిపతిగా పవన్‌కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే అడవుల్ని పరిరక్షిస్తామని కూడా గట్టిగా హామీ ఇచ్చారు. తాజాగా ఎక్స్ వేదికగా ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మందిని పట్టుకోవడంపై అభినందనలు తెలిపారు. అధికారుల్ని ప్రోత్సహించడం వరకూ ఓకే. అయితే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సాక్షిగా కూటమి పాలనలో, అది కూడా అటవీశాఖ మంత్రిగా పవన్‌కల్యాణ్ బాధ్యతలు వహిస్తున్నా, యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ అవుతుందని స్పష్టమైంది. దొరికితే దొంగలు, దొరక్కపోతే దొరలనే సామెత తెలిసిందే. ఏకంగా రూ.4 కోట్లకు పైగా ఎర్రచందనం అక్రమంగా రవాణా అయ్యిందని, కూటమి పాలనలో ఏ స్థాయిలో అడవులు నరికివేతకు గురి అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఏమి జరిగిందంటే...!
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కొమిటోని చెరువు వద్ద చేపట్టిన భారీ మొత్తంలో ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మందిని అరెస్టు చేసి, వారి నుంచి పది దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ స్మగ్లర్లు తమిళనాడువాసులు. స్మగ్లర్లను విచారించగా కర్ణాటక రాష్ట్రం హోస్పేట కటికినహళ్లి నీలగిరి తోటలో దాచిన మరో 185 ఎర్రచందనం దుంగల గురించి చెప్పడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం 195 దుంగలను స్వాధీనం చేసుకున్నట్టైంది. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ దాదాపు రూ.4.20 కోట్లు ఉంటుందని అంచనా. వీటిని గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో ఏపీ అటవీ శాఖ, రెడ్ శాండల్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషించారని పవన్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. నేరస్తులను పట్టుకున్న అధికారులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
నెటిజన్ల ప్రశ్నలు...
అసలు ఒక్క చెట్టుపై కూడా వేటు పడకుండా కంటికి రెప్పలా కాపాడ్డం అని పవన్ గుర్తించాలి. తన శాఖకు సంబంధించిన అధికారులకు అభినందనల సంగతి పక్కన పెడితే, అసలు స్మగ్లర్లకు భయమే లేదని మరోసారి రుజువైంది. పట్టుబడింది ఎర్రచందనం కూలీలే తప్ప, స్మగ్లర్లు కాదనే మాట వినిపిస్తోంది. స్మగ్లర్లకు అధికారం, అలాగే అటవీశాఖ సిబ్బంది అండ లేకపోతే, రాష్ట్ర పొలిమేరలు దాటే అవకాశం వుంటుందా? ఒక్కసారి పవన్ ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.