ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలి
*పలు అంశాలపై నోడల్ అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్
విశాఖపట్టణం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 7; ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలని, అన్ని రకాల కార్యకలాపాలను అత్యంత సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని నోడల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. నామినేషన్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వసతుల కల్పన, జాబితాల తయారీ, సిబ్బంది కేటాయింపు, వివిధ రకాల విధుల నిర్వహణ తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగు హాలులో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని, అనుమతుల జారీ విషయంలో చురుగ్గా వ్యవహరించాలని, సింగిల్ విండో విధానం పాటించాలని సూచించారు. ఆయా నోడల్ అధికారులు ఇప్పటి వరకు చేపట్టిన చర్యల గురించి ఆరా తీసిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. మరింత జాగ్రత్తగా ఉండాలని, ఎవరికి అప్పగించిన బాధ్యతలను వారు తు.చ. తప్పకుండా నిర్వర్తించాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. సాంకేతికపరమైన అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో ఉంచుకొని అన్ని కార్యకలాపాలను నిర్వహించాలని హితవు పలికారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది తరలింపు, ఇతర ఎన్నికల సామగ్రి తరలింపు తదితర అవసరాలకు రవాణా సదుపాయం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని సూచించారు. సమావేశానికి హాజరైన అధికారులు వారి పరిధిలోని పరిస్థితుల గురించి రిటర్నింగ్ అధికారికి వివరించారు.
జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఏఆర్వో, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.