Sidebar


Welcome to Vizag Express
భూముల క్రమబద్దీకరణకు ఇలా దరఖాస్తు చేసుకోండి

09-02-2025 08:22:44

భూముల క్రమబద్దీకరణకు ఇలా దరఖాస్తు చేసుకోండి

.రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సిసిఎల్ఎ ఛీప్ కమీషనర్ జి.జయ లక్ష్మి

విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్; 
రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతోమంది నిరు పేదలకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈజీగా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం దక్కింది. ఈ పథకానికి సంబంధించి మీ సేవ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సిసిఎల్ఎ ఛీప్ కమీషనర్ జి.జయ లక్ష్మి తెలిపారు. జిఓ నెంబర్ 30ని అనుసరించి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం 2025 పేరిట భూముల క్రమబద్ధీకరణ చేపడతామని, ఈ సంవత్సరం డిసెంబరు 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. క్రమబద్ధీకరణ పట్టాలను మహిళల పేరిట మాత్రమే జారీ చేస్తామన్నారు. 

క్రమబద్ధీకరణకు మేరకు లబ్ధిదారులకు పట్టా, కన్వేయన్స్‌ డీడ్‌ అందజేసిన రెండేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు జారీ చేస్తామని ఛీప్ కమీషనర్ వివరించారు. తమ పూర్తి వివరాలను నిర్ధశించిన దృవీకరణ పత్రాలతో మీసేవ ద్వారా అప్ లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. 2019 అక్టోబరు 15ను ప్రమాణిక తేదీగా తీసుకుని ఆతేదీ కంటే ముందు ఆక్రమణలలో ఉన్న భూములను నిబంధనలు అనుసరించి క్రమబద్ధీకరిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఆదేశాల మేరకు సిసిఎల్ఎ అధికారులు అత్యంత వేగంగా, ప్రామాణిక మైన దరఖాస్తు విధానాన్ని మీసేవ ద్వారా అందుబాటులోకి తీసుకు వచ్చారు. 

150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని, రిజిస్ట్రేషన్‌ ఫీజు సైతం చెల్లించక్కర్లేదని తెలిపారు. దారిద్రరేఖకు దిగువను ఉండి 151 నుండి 300 గజాల లోపు అక్రమణలకు బేసిక్ ధరలో 15 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజులో 50 శాతం చెల్లించాలి. దారిద్రరేఖకు ఎగువన ఉన్న వారు పూర్తి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. 300 నుండి 450 గజాల పరిధిలో బిపిఎల్ కుటుంబాల వారు వందశాతం బేసిక్ ధర, 50 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఇదే విభాగంలో దారిద్రరేఖకు ఎగువన ఉన్న వారు 200శాతం బేసిక్ ధర, పూర్తి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. 450 గజాలకు మించిన అక్రమణలో ఎవరు ఉన్నప్పటికీ బేసిక్ ధరకు ఐదు రెట్లు, వందశాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి క్రమబద్దీకరించుకోవలసి ఉంటుంది. అందుకు సిద్దంగా లేకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.  

లే అవుట్ స్థలాలు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్‌లో నిర్దేశిత స్థలాలు, జలవనరులకు సంబంధించిన స్థలాల్లో క్రమబద్ధీకరణ చేయబోరన్నారు. లబ్ధిదారులు, కుటుంబసభ్యులు ఐటీ చెల్లింపుదారై ఉండకూడదని, నాలుగు చక్రాలు వాహనం ఉండకూడదని జయలక్ష్మి స్పష్టం చేసారు.  గరిష్ఠంగా గ్రామాల్లో నెలకు రూ. 10,000, పట్టణాల్లో నెలకు రూ.14,000 ఆదాయం ఉన్నవారు దీనికి అర్హులుగా నిర్ణయించగా, నెలకు రూ.300లోపు విద్యుత్తు ఛార్జీల చెల్లింపు ఉండాలన్నారు. మెట్ట, మాగాణి కింద కలిపి 10 ఎకరాలకు మించకూడదు. ఆర్‌సీసీ రూఫ్‌/ఆస్‌బెస్టాస్‌ రూఫ్‌తో ఇటుక గోడలతో నిర్మాణాన్ని పరిగణన లోకి తీసుకుంటామని జయలక్ష్మి వివరించారు. ఆస్తిపన్ను చెల్లింపు, విద్యుత్తు బిల్లు, వాటర్‌ బిల్లులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. 

ఇప్పటికే స్వీకరించి, పెండింగులో ఉన్న దరఖాస్తులనూ పరిగణనలోకి తీసుకుంటామని, రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ల పర్యవేక్షణలో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ఆక్రమణలు జరిగిన ప్రాంతాలు పరిశీస్తారన్నారు. అనంతరం అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను గ్రామ,వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తారని, అభ్యంతరాలు స్వీకరించి తహసీల్దార్లు తుది జాబితాను సబ్‌కలెక్టర్‌, ఆర్‌డీఓకు పంపిస్తారన్నారు. సబ్‌ డివిజన్‌ లెవెల్‌ అప్రూవల్‌ కమిటీ ప్రకటించిన అర్హుల జాబితాపై అభ్యంతరాలు ఉంటే జాయింట్‌ కలెక్టర్‌కు 30 రోజుల్లోగా అప్పీలు చేసుకోవచ్చన్నారు. అర్హుల జాబితా ఖరారైన తర్వాత ఆ వివరాలను తహసీల్దార్లు ఆ ప్రాంత సబ్‌-రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లకు పంపుతారని, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జయలక్ష్మి కోరారు.