జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించాలి!
ఎమ్మెల్యే శిరీషా కు రైతు సంఘం నేతలు వినతి!
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,పిబ్రవరి 8;
ఉద్దానంలో పండిస్తున్న జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించి 80 కేజీల బస్తా రూ. 16 వేలుకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు, ఎపి జీడి రైతు సంఘం జిల్లా కార్యదర్శి తెప్పల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పలాస ఎమ్మెల్యే కార్యాలయంలో ఎపి జీడి రైతు సంఘం ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు జీడి సమస్యల పై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికంగా పిక్కలను కొనుగోలు చేసిన తర్వాతే విదేశీ పిక్కల దిగుమతులకు అనుమతి ఇవ్వాలని కోరారు.
జీడి తోటలలో అంతర కృషి పరికరాలు ఉచితంగా రైతులకు అందించాలన్నారు. జీడి పరిశోధన కేంద్రాలు ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసి, అభివృద్ధి చేసిన నాణ్యమైన మొక్కలు రైతులకు అందించాలని కోరారు. జీడి పంట విస్తరణకు జీడి తోటలు పునరుద్ధరణకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామి పథకం ద్వారా ఎకరం జీడి తోట అభివృద్ధికి మూడు సంవత్సరాలకు 94 వేల రూపాయిలు రైతులకు క్షేత్ర స్థాయిలో అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. జీడి పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందించాలని, రైతువారీ సాగు విస్తీర్ణం నమోదు చేసి, జీడి పంటకు వాతావరణ. బీమా అమలు చేయాలని కోరారు. జీడి పంట ప్రాంతంలో జీడి పిక్కలు, జీడి పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. జీడి రైతులకు జీడి పిక్కలు ఆరబెట్టుటకు టార్పాలిన్లు ఉచితంగా అందించాలని, పలాస కేంద్రంగా రాష్ట్రంలో జీడి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీని పై ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందిస్తూ జీడి పంటకు గిట్టుబాటు ధర కోసం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడం జరిగిందని, జీడి పండే ఇతర జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేతో కలిసి జీడి పంట మద్దతు ధర ప్రకటించడం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేస్తున్న వారిలో ఎన్ గణపతి, జి బాలకృష్ణ కోనేరు ఆదినారాయణ మడ్డు రాఘవరావు జి నీలకంఠం బర్ల గోపి లండ జీవన్ సాల్ని కుర్మరావు కోదండరావు దాసరి మోహన్ తదితర జీడిరైతులు పాల్గొన్నారు.