Sidebar


Welcome to Vizag Express
ఆకట్టుకున్న అంతర రాష్ట్ర నాటిక పోటీలు

09-02-2025 08:39:05

ఆకట్టుకున్న అంతర రాష్ట్ర నాటిక పోటీలు*

కంచిలి వైజాగ్  ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి8:

 కవిటి మండలం బొరివంకలో కళింగ సీమ కళాపీఠం ఆధ్వర్యంలో శనివారం ప్రదర్శించిన బల్లెడ అనసూయమ్మ స్మారక ఆహ్వానిత ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదట ప్రదర్శనగా గుంటూరు జిల్లాకు చెందిన శ్రీసాయి ఆర్ట్స్ వారు ప్రదర్శించిన "జనరల్ బోగీలు" నాటిక సగటు రైలు ప్రయాణికుడ్ని ఆలోచనల్లో పడేసింది. ఖర్చు తక్కువ అని సగటు ప్రయాణీకుడు రైలులో ఖాళీ లేకపోయినా మన బాధలు పడుతూ జనరల్ బోగీల్లో ప్రయాణిస్తుంటారు. అనుకోని రైలు ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం సైతం ఆదుకునేందుకు ముందుకు రాదు. ఈ నేపథ్యంలో రైలు ప్రమాదంలో కొడుకును పోగొట్టుకున్న కథానాయిక సావిత్రమ్మ ప్రతీ రైలులో జనరల్ బోగీలు పెంచాలంటూ ఉత్తరాలు ద్వారా ప్రారంభించిన ఉద్యమం చివరికి ఆమెను జైలు పాలు చేస్తుంది. అయినా ధైర్యం కోల్పోకుండా ఆమె చేసిన పోరాటానికి ప్రజలు సైతం మద్దతు పలికారు. సావిత్రమ్మ పాత్రలో సురభి ప్రభావతి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రముఖ సినీ క్యారెట్ ఆర్టిస్ట్ గోపరాజు విజయ్ దర్శకత్వం వహించగా, పి.టీ. మాధవ్ నాటికను రచించారు.
      రెండవ నాటిక తెలుగు కళాసమితి విశాఖపట్నం వారు ప్రదర్శించిన "నిశ్శబ్ధమా నీ ఖరీదు ఎంత..?"  అనాదిగా కుటుంబ వ్యవస్థను మెరుగుపరుద్దామని చట్టంలో కొన్ని మార్పులు వలన కలిగే ఫలితాలుపై కళ్ళకు కట్టినట్లు చూపించారు. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు తెచ్చిన కొత్త చట్టాలు వలన నలిగిపోతున్న కుటుంబాలు, వివాహ వ్యవస్థ,  అక్రమ సంబంధాలు పై ప్రదర్శించిన నాటికను తిలకించిన సగటు ప్రేక్షకుడు ఈ సమాజం ఎటు పోతుంది , దీన్ని ఎవ్వరు ప్రశ్నిస్తారు అనే ప్రశ్న తలెత్తే విధంగా రచయిత పి.టి. మాధవ్ రచించారు. ఈ నాటికను చలసాని కృష్ణప్రసాద్ దర్శకత్వం వహించారు. నటులు కన్నబాబు, పిపి.వరప్రసాద్, హేమ, కృష్ణప్రసాద్, రాంబాబు, లాస్యలు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.న్యాయ నిర్ణేతలుగా మనాపురం సత్యన్నారాయణ, కోరుకొండ బ్రహ్మానందం, కేవి.మంగరావు, వ్యవహరించారు.