ఆదివాసుల హక్కుల చట్టాల జోలికొస్తే ఊరుకోం
అసెంబ్లీ స్పీకర్ ఆదివాసులకు క్షమాపణ చెప్పాలి
అఖిలపక్షం, గిరిజన సంఘాల నేతలు
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి,11: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవల విశాఖపట్నం లో పర్యాటక ప్రాంతం అభివృద్ధి కార్యక్రమ సమావేశంలో 1/70 చట్టాన్ని సవరించాలంటూ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ నెల 11,12 తేదీలలో అఖిలపక్షం, గిరిజన సంఘాలు, పిలుపు మేరకు 48 గంటల నిరవధిక రాష్ట్ర మన్యం బంద్ ను మంగళవారం అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రం నాలుగు రోడ్ల కూడలి, మండల పరిసర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అఖిలపక్ష ప్రజా సంఘాలు, వైఎస్ఆర్సిపి, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, వివిధ పార్టీల నేతలు, గిరిజన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, మహిళ సంఘాలు, ప్రజలు, బంద్ లో పాల్గొని నిరసనను ఉదృతం చేశారు. కార్యక్రమంలో ఉదయం 4 గంటల నుండి మండల కేంద్రం నాలుగు రోడ్ల కూడలిలో వాహనాలను అడ్డుకున్నారు. గిరిజన ప్రాంతంలో తమ హక్కులు చట్టాలను కాపాడుకోవడం కోసం స్వతసిద్ధంగా ముక్త కంఠంతో గిరిజన ప్రజలు రోడ్లపై వచ్చి ఆందోళనలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సంఘాల నేతలు మాట్లాడారు. గిరిజన చట్టాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసుల చట్టాలను విస్మరించేలా మాట్లాడే వారిపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. స్పీకర్ భూ బదలాయింపు పై చేసిన అనుచిత వ్యాఖ్యలూ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదివాసుల కేటాయించిన చట్టాలను ఏదైతే విస్మరిస్తారో ఆదివాసులకు కించపరిచినట్లేనని అసెంబ్లీ స్పీకర్ ఆదివాసులకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని భవిష్యత్తులో ఆదివాసులకు గాను ఆదివాసి చట్టాలకు గాను మాట్లాడే గిరిజనేతరులు ఎవరున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. లేనియెడల బంద్ ను మరింత ఉధృతం చేసి నిరసన ఆందోళనలు చేసి ఉద్యమ బాటలో తమ చట్టాలను హక్కులను కాపాడుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రం నాలుగు రోడ్ల కూడలిలో వంటావార్పు కార్యక్రమంతో యధావిధిగా రాష్ట్ర మన్యం బంద్ కొనసాగుతుందని అఖిలపక్షం గిరిజన సంఘం నేతలు తెలిపారు.