జనం కోసమే ప్రజాధనం వెచ్చింపు ... మరి మీరో
- కార్పరేట్లకు రుణ మాఫీ ... సామాన్యులకు మొండిచేయి
- ధనికులకు రుణ మాఫీ చేయకుండా చట్టం తీసుకురాగలరా?
- ప్రధాని మోదీకి కేజ్రీవాల్ ఖాటు లేఖ
ఢిల్లీ, వైజాగ్ ఎక్స్‌ప్రెస్; బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. బిలియనీర్లు తీసుకున్న రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేస్తోందని.. మరోవైపు సాధారణ ప్రజలపై అధిక పన్ను భారాన్ని మోపుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ధనికులు తీసుకున్న రుణాలను మాఫీ చేయకుండా ఒక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖను కేజ్రీవాల్ రాశారు.. "కేంద్ర ప్రభుత్వం బిలియనీర్లకు అనుకూలంగా పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ధనికులకు వేలకోట్ల కార్పొరేట్ లోన్స్ ను మాఫీ చేస్తోంది. ఇలాంటి చర్యల వల్ల సాధారణ ప్రజలపై పన్నుల భారం అధికమవుతోంది. సాధారణ ప్రజలు తమ జీతాల్లో సగం డబ్బును టాక్స్ రూపంలో కడుతున్నారు. మరి మోదీ సర్కార్ పేదలు తీసుకున్న లోన్ లను ఎందుకు మాఫీ చేయదు. ప్రజల హోం లోన్, కార్ లోన్ లను మాఫీ చేయోచ్చు కదా..?" అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. బిలియనీర్లకు లోన్ మాఫీ చేయడాన్ని తక్షణమే ఆపేయాలని, నిత్యావసరాలపై జీఎస్టీ రేట్లను పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల సొమ్మును ప్రజల కోసమే ఖర్చు చేస్తోందని.. కానీ బీజేపీ మాత్రం వాళ్ల స్నేహితులకోసం ఖర్చు చేస్తుందని మండిపడ్డారు. దిల్లీ ప్రజలకు విద్య, వైద్యం, ఫ్రీ బస్, ఫ్రీ విద్యుత్, తాగునీటి సరఫరా.. అన్నీ ఇచ్చామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న 20 రాష్ట్రాల్లో పవర్ కట్స్ ఉన్నాయన్నారు. చీపురు గుర్తుకు ఓటేస్తే 24 గంటలు విద్యుత్ ఉంటుందని.. కమలానికి ఓటేస్తే కనీసం 6 గంటలు పవర్ కట్స్ ఉంటాయని కేజ్రీవాల్ తెలిపారు.