క్షణికావేశం వద్దు... జీవితానికి ముగింపు పలకవద్దు
... ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
...ఒత్తిళ్లకు గురి కావొద్దు
..... భీమిలి సీఐ బొడ్డేపల్లి సుధాకర్ యువతకు హితవు
భీమిలి, వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ జనవరి 30 :.
భూ ప్రపంచంలో సమస్యలు లేని వ్యక్తులంటూ ఉండరని.. అలా ఉంటే భగవంతుడితో సమానమని భీమునిపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బొడ్డేపల్లి సుధాకర్ పేర్కొన్నారు. యువత తల్లిదండ్రులు వారి బంగారు భవిష్యత్తు కోసం ఎన్నెన్నో కలలు కంటారన్నారు. కలల సాకారానికై కావలసిన సహకారాలను తమ పిల్లలకు అందిస్తారన్నారు.ఈనేపద్యంలో రాత్రింబవళ్లు శ్రమించి ఏలోటు లేకుండా ఉండేందుకు నిరంతరాయంగా శ్రమిస్తారన్నారు.కానీ నేటి యువత మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నాలకి పాల్పడుతున్నారని తెలిపారు. క్షణికావేశం లో తీసుకున్న నిర్ణయాలు వల్ల తల్లిదండ్రులతో పాటు బంధువులు మనోవేదనకు గురవుతున్నారన్నారు.3 రోజులు క్రితం ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తోన్న 16 ఏళ్ల విద్యార్థిని గోస్తనీ నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.గమనించిన తోటి విద్యార్థులు పదహారేళ్ల విద్యార్థిని ప్రాణాలతో కాపాడారు.విద్యార్థిని తల్లితండ్రులు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఈ విషయమై సీఐ.సుధాకర్ స్పందించారు ఈనెల 24న భార్యాభర్తల మధ్య చిన్న తగాదాతో మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయన్నారు.వీరిలో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు ఉన్నారన్నారు.ఆ సంఘటన మరువక ముందే కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన ఓ విద్యార్థిని తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సమంజసం కాదని అన్నారు.సమస్యలను ఎదుర్కొనే ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సమాజంలో పరిస్థితులను ఎదుర్కొనేలా మనోధైర్యాన్ని నింపాలని సూచించారు.ప్రతి చిన్న విషయానికి కుంగిపోవడం,మదన పడడం సమాజ హితం కాదని పేర్కొన్నారు.ఆరోగ్య,ఆర్థిక,కుటుంబ సమస్యలు లేని సమాజం ఉండదన్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆయా కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగులుస్తుందని చెప్పారు. మిత్రుల,సన్నిహితుల విలువైన ఆలోచనలతోప్రాణాపాయాలను నివారించవచ్చన్నారు. మనోవేదనలను శ్రేయోభిలాషులకు వివరిస్తే ప్రతీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రాణాలు వదలడమే పరిష్కారం కాదని భీమిలి పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరారు.