Sidebar


Welcome to Vizag Express
తరిగిపోతున్న ఇసుక దిబ్బలు

30-01-2025 20:26:12

తరిగిపోతున్న ఇసుక దిబ్బలు 

 రాత్రి సమయాలలో జోరుగా ఇసుక తరలింపు 

 పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ యంత్రాంగం
 
ప్రభుత్వ ఆదాయానికి గండి
 
భీమిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ జనవరి 30:

రాత్రి అయితే చాలు గోస్తనీ నదీ ప్రవాహం వద్ద ఏర్పడిన ఇసుక దిబ్బలను ఇసుక బకాసురులు ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు.వర్షాలు పడే సమయంలో నదీ ప్రవాహం జోరుగా ప్రవహిస్తుంది.ఈ నేపథ్యంలో ఇసుక దిబ్బలు ఏర్పడతాయి.దీనిని అదునుగా తీసుకుని కొంతమంది ఇసుక వ్యాపారస్తులు రాత్రి సమయాలలో అక్రమ తవ్వకాలు జెసిబి తో లారీలు ద్వారా తరలిస్తున్నారు. కొంతమంది నదిలో నీరు ఉంటుండగానే మునకవేసి గడ్డపార్లతో ఇసుకను తోడేస్తున్నారు.నది నుండి నిబంధనలకు లోబడి చేస్తున్నామంటూ ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక దిబ్బల నిల్వ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.అక్కడి నుండి ట్రాక్టర్లు,లారీలు ద్వారా శ్రీకాకుళం నుంచి తెస్తున్న ఇసుకతో కలిపి కల్తీ చేస్తున్నారు.తద్వారా లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు.కల్తీ ఇసుకతో భవననిర్మాణదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.గోస్తనీ నదిలో ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వకాలు చేయడంతో గోతులు ఏర్పడి వర్షాకాలంలో ఊబుల్లా తయారవుతున్నాయి.ఊబుల్లో కొన్నేళ్ల నుండి మనుషులతో పాటు మూగ జీవాలు కూడా మృత్యువాత పడ్డ సందర్బాలు ఎన్నో ఉన్నాయి.ఇంత జరుగుతున్నా అధికారుల సమన్వయ లోపంతో ఇసుక బకాసురులు పెట్రేగి పోతున్నారు.పద్మనాభం,భీమిలి మండలాల పరిధిలో రౌతులపాలెం,మునివానిపాలెం,సామయ్యవలస,క్రిష్ణా పురం, మద్ది,పొట్నూరు,తాటితూరు,టి నగరప్పాలెం,తగరపువలస ప్రాంతాలలో ఇసుక దోపిడి అధికంగా సాగుతుంది.జెసిపి సహాయంతో లారీల ద్వారా అర్ధరాత్రి సమయాలలో విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోస్తనీ నదిలో బావులవద్ద బురద నీరు బావుల్లోకి చేరకుండా ఇసుక బస్తాలను ఆర్డబ్ల్యూఎస్,జీవీఎంసీ అధికారులు ఏర్పాటుచేశారు. ఇసుక బకాసురులు వీటిని సైతం త్రవ్వేయడంతో వర్షాకాలంలో కుళాయిలకు బురద నీరు ప్రత్యక్షమవుతుంది దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలతో పాటు తగరపువలస పట్టణ ప్రాంత వాసులు సైతం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక దందాను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.