Sidebar


Welcome to Vizag Express
శ్రీశారదా పీఠానికి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్

30-01-2025 20:43:25

శ్రీశారదా పీఠానికి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్

- జ‌గ‌న్ గురూజీకి విదేశీ నిధుల‌కు అవ‌కాశం 
- ఎఫ్‌సీఆర్ఏ లైసెన్సుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ 
- ఏపీ కూట‌మి స‌ర్కారుకు షాక్‌
- కేంద్రం నుంచి జ‌గ‌న్ తిప్పిన చ‌క్ర‌మ ఫ‌లిత‌మేనా!

విశాఖ‌ప‌ట్నం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌;  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలోనూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువు హవా కొనసాగుతోంది.  విశాఖ శ్రీశారదా పీఠానికి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫారిన్ కంట్రీబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) లైసెన్స్ ను మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

 విదేశాల నుంచి విరాళాలు.. 

ఈ లైసెన్స్ పొందడం వల్ల విదేశాల నుంచి విరాళాలను స్వీకరించవచ్చు. అంతర్జాతీయ సంస్థల నుంచీ డొనేషన్లను తీసుకోవడానికి వెసలుబాటు లభిస్తుంది. ఇప్పటిదాకా శారదా పీఠానికి ఈ సౌకర్యం ఉండేది కాదు. ఎఫ్‌సీఆర్ఏ లైసెన్సును జారీ చేయాలంటూ గతంలో శారదా పీఠం ప్రతినిధులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. వాటన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించిన తరువాత ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.  ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో గల బంకే బిహారీ ఆలయానికీ ఎఫ్‌సీఆర్ఏ కింద లైసెన్సును జారీ చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఇప్పుడు తాజాగా విశాఖ శ్రీ శారదా పీఠానికి అనుమతులను ఇచ్చింది. ఈ లైసెన్స్ లభించడం పట్ల శారదా పీఠం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తోన్నారు.   దేశంలో ఆధ్యాత్మిక చింతన, హిందూ ధర్మ కార్యకలాపాలను మరింత విస్తరింపజేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించే ధార్మిక సంస్థలు, వివాదరహిత ఆశ్రమాలు, ఆలయాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి ఎఫ్‌సీఆర్ఏ కింద కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లైసెన్సులను మంజూరు చేయడం ఆనవాయితీగా వస్తోంది.  ఇప్పటివరకు శారదాపీఠంతో సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గల 91 ధార్మిక సంస్థలకు ఈ లైసెన్సులు మంజూరు అయ్యాయి. 2022లో ఎఫ్‌సీఆర్ఏలో కీలక మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. నిబంధనలను మరింత సరళీకరించింది. ఫలితంగా ఈ ఏడాది తరువాత విదేశీ విరాళాలు 20 నుంచి 50 శాతానికి పెరిగాయి. 

పెందుర్తి చినముషిడివాడలో....

 పెందుర్తి చినముషిడివాడలో 1997లో శారదాపీఠం ఏర్పాటైన విషయం తెలిసిందే. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి దీన్ని స్థాపించారు. సనాతన వైదిక ధర్మం, అద్వైత వేదాంతాలను విస్తరింపజేయడం ఈ పీఠం ముఖ్య ఉద్దేశం. రాజశ్యామల దేవి, ఆదిశంకరాచార్య, సుబ్రహ్మణ్య స్వామి, వనదుర్గ, దక్షిణామూర్తి ఆలయాలు ఈ పీఠం ప్రాంగణంలో పూజలందుకుంటున్నాయి.  మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కే చంద్రశేఖర్ రావు గతంలో తరచూ ఈ పీఠాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహించే రాజశ్యామల యాగాల్లో జగన్ తరచూ పాల్గొన్నారు కూడా. స్వరూపానందేంద్ర సరస్వతిని తమ గురువుగా భావిస్తుంటారు వారిద్దరూ.