ఏపీలో ‘వాట్సాప్ పాలన’
- వాట్సప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009
- ప్రారంభించిన మంత్రి లోకేష్
అమరావతి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్: దేశంలోనే మొదటి సారిగా ఏపీ లో వాట్సాప్ పాలన చేయనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ప్రారంభించారు. తొలిదశలో ప్రజలకు 161 సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం ప్రభుత్వం మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ పాలన తీసుకువస్తున్నామని, ప్రపంచంలోనే ఎక్కడా ఇలాంటి సేవలు లేవని అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్‌తో సులభంగా సమస్యల పరిష్కారం చేసుకోవచ్చుని, యువగళం పాదయాత్రలోనే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
నకిలీకి ఆస్కారం ఉండదు..
ప్రతి సర్టిఫికెట్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుందని.. తద్వారా వాట్సాప్ గవర్నెన్స్‌తో ఎక్కడా నకిలీకి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. తాను యువగళం పాదయాత్ర చేసినప్పుడు అన్ని వర్గాలను కలిశానని, గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని కళ్లారా చూశానని లోకేష్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు ఎందుకు తీసుకెళ్లలేము అని.. యువగళంలో వచ్చిన సవాల్ ఫలితమే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అని మంత్రి లోకేష్ తెలిపారు. చంద్రబాబు 2.0 పనితీరుకు ఇది మరో మైలురాయి అని అన్నారు.
మాకు ఎంతో గర్వంగా ఉంది...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ప్రజాసేవలు అందించటం తమకు గర్వంగా ఉందని మెటా సంస్థ ఉపాధ్యక్షురాలు సంధ్య అన్నారు. వాట్సాప్ ఇప్పుడు ఎక్కువ మంది వాడుతున్నందున పీపుల్ ఫ్రెండ్లీగా దీనిని రూపొందించామని, వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించే విధానంపై చాలా కృషి చేశామని సంధ్య వ్యాఖ్యానించారు.
వాట్సప్ సేవల నెంబర్ ఇదే..
ఆంధ్రప్రదేశ్‌లో వాట్సప్ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇక నుంచి ప్రభుత్వ ధృవపత్రాలన్నీ వాట్సప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా వాట్సప్ సేవల కోసం నెంబర్‌ను విడుదల చేశారు మంత్రి లోకేష్. వాట్సప్ గవర్నెన్స్ కోసం నెంబర్ 9552300009ను అనౌన్స్ చేశారాయన. దేశంలోనే తొలిసారి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించనుంది ఏపీ సర్కార్. మొదటి విడతలో 161 సేవలను వాట్సప్ ద్వారా అందించనున్నారు. ఈ తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు అందిస్తారు.
ఏయే సేవలు అందించనున్నారు..
దేవాదాయ శాఖలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డోనేషన్ల సేవల్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్ ల్యాండ్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లను జారీ చేయనున్నారు. మున్సిపల్ శాఖలో ఆస్తిపన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు జారీకి నిర్ణయించారు. ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్ని వాట్సప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు.