Sidebar


Welcome to Vizag Express
ఆయన ఓ చదువుల మూర్తి

30-01-2025 20:46:53

ఆయన ఓ చదువుల మూర్తి!

* పనిచేసినచోట విశేష మన్ననలు 
* వేలాదిమందికి విద్య బుద్ధులు 

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 30

ఆయన ఓ చదువుల మూర్తి. ఎంతోమంది కి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడు. పనిచేసిన ప్రతిచోట విద్యార్థుల తల్లిదండ్రుల మన్ననలు అందుకున్నారు. స్థానికుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.. ఆయనే అంబటి కృష్ణమూర్తి మాస్టర్. మూడున్నర దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన ఆయన ఈరోజు ( శుక్రవారం ) పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం మందస మండలం బహడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నారు. సాధారణ ఎస్జిటిగా ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించిన కృష్ణమూర్తి మాస్టారు నేడు పదవీ విరమణ చేయనున్న సందర్భంగా ప్రత్యేక కథనం. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత చదువులంటే అతి కష్టం. చదివించడం కూడా తల్లిదండ్రులకు ఇబ్బంది కరం. అయితే కృష్ణమూర్తి విషయంలో అలా జరగలేదు. తల్లిదండ్రులు అంబటి కేశవరావు, రే కమ్మలు మత్స్యకార కుటుంబానికి చెందినవారు.  సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామానికి చెందిన వీరికి కృష్ణమూర్తి మొదటి సంతానం. ప్రాథమిక స్థాయి నుంచి చదువుల పట్ల మమకారం ఉండడంతో అతి కష్టం మీద చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి చదివారు కృష్ణమూర్తి. గ్రామంలోని సమితి ప్రైమరీ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు కృష్ణమూర్తి. బారువ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు చదివారు. 1979లో సోంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీలో చేరారు. బీఎస్సీ పూర్తి చేశారు. 1986లో గుంటూరు డైట్ కాలేజీలో టిటిసి పూర్తి చేశారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీలో బీఈడీ.. చెన్నై యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేయగలిగారు. 1989 డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించారు. జూన్ 1న సెకండరీ గ్రేడ్ టీచర్గా ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టారు. కంచిలి మండలం పోలేరు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరారు. 2001లో స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందారు. టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2011 వరకు పనిచేశారు. ఆ కాలంలోనే ఎన్సిసి ఆఫీసర్ గా కూడా సేవలందించారు. 2011 నుంచి 2019 వరకు పొందూరు ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. 2017లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అప్పటి కలెక్టర్ లక్ష్మీనరసింహం చేతుల మీదుగా అవార్డు ,మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం మందస మండలం బహడపల్లి ఉన్నత పాఠశాలలో హెచ్ఎం గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తన ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పారు. తన విజయం వెనుక భార్య గీతాంజలి కృషి ఉందని చెప్పుకుంటారు. కృష్ణమూర్తి మాస్టారుకు విద్యాసాగర్, సుధా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు విద్యాసాగర్ మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తుండగా.. కుమార్తె సుధా ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో ఫ్లైట్ లెఫ్ట్నెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. కృష్ణమూర్తి మాస్టారు పదవీ విరమణ పై వివిధ రంగాల్లో స్థిరపడిన ఆయన శిష్యులు అభినందనలు తెలుపుతున్నారు. మాస్టర్ సేవలపై కృతజ్ఞతలు తెలుపుతున్నారు