చిన్నారులకు పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలి
* అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
విశాఖపట్టణం, వైజాగ్ ఎక్స్ ప్రెస్; చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గాజువాక మండలం అగనంపూడి కె.ఎస్.ఎన్. రెడ్డి నగర్ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం ఉదయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించారు. చిన్నారులకు అందిస్తున్న ఆహార ప్యాకెట్లు, పాలు, గుడ్లను పరిశీలించారు. పిల్లల హాజరు శాతాన్ని, ఉద్యోగుల హాజరు పట్టీలను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. క్రమం తప్పకుండా చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. తనిఖీలో భాగంగా కలెక్టర్ అక్కడి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. కుశల ప్రశ్నలు వేశారు. ఆయన వెంట స్థానిక జడ్పీ, ప్రశాంతినగర్ సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు ఉన్నారు.