బంగారు ఉంగరం దొరకలేదని ఆత్మహత్య

3/29/2023 12:36:48 PM

వరంగల్, ఎక్స్ ప్రెస్ న్యూస్ మార్చి: తన బంగారు ఉంగరం పోయిందని నిండు జీవితాన్ని బలితీసుకుంది ఓ డిగ్రీ విద్యార్థిని.. ఇల్లంతా వెదికి ఎక్కడా దొరకకపోయేసరికి నాన్న మన్నించు అంటూ ఓ లేఖ రాసి మనోవేదనతో ఉరివేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లి కన్నవారికి తీరని దుఃఖం మిగిల్చింది.. ఈ విషాద ఘటన వరంగల్‌ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగింది.

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన మద్దుల జానకి రాములు-రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హేమలతారెడ్డి(19) హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నారు. చిన్న కుమార్తె అశ్విత మరిపెడలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుంది. ఉగాది సందర్భంగా హేమలతారెడ్డి ఈ నెల 20న ఇంటికొచ్చారు. బుధవారం తన చేతికున్న పావుతులం బంగారపు ఉంగరం ఎక్కడో జారిపోయింది. అన్నిచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆర్నెల్ల కిందట బంగారు గొలుసు సైతం పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఉంగరం కూడా పోవడంతో తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో మనోవేదనకు గురయ్యారు.

‘సారీ డాడీ...నాకు భయమేస్తోంది’ అంటూ లేఖ రాసిపెట్టి ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సాయంత్రం వ్యవసాయ భూమి నుంచి ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు తలుపులు వేసి ఉండటంతో అనుమానం కలిగింది. బలంగా తలుపులు తెరిచి ఇంట్లోకెళ్లి చూడగా ఉరి వేసుకుని ఉంది. వెంటనే కిందకు దింపి కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి విద్యార్థిని మృతికి గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి చరవాణిలో తోటి మిత్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో పరిశీలించగా తండ్రికి రాసిన లేఖ లభ్యమవడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై జగదీష్‌ తెలిపారు.

Name*
Email*
Comment*