*ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పై సమీక్ష
*కేబినెట్ లో మార్పులు సీఎం ఇష్టం - మంత్రి బొత్స సత్యనారాయణ*
ఉత్తరాంధ్రలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి విషయంలో లోపం ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటున్నాను.. వేరేవారి పై బాధ్యత వేయటం నా రాజకీయ జీవితంలో అలవాటు లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ ఓటమి, అధికార వికేంద్రీకరణ, కేబినెట్ విస్తరణ, ముందస్తు ఎన్నికల ఊహాగానాలు, నిన్న అమరావతిలో బీజేపీ నేతలపై జరిగిన దాడి వంటి అంశాలపై శనివారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకులపై దాడి చేయాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఎక్కడికైనా వెళ్లినా పరిస్థితులు బట్టి మాట్లాడాలన్నారు. తమపై బురద చల్లేందుకు రాజకీయ ప్రయోజనాలకోసం ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు మా ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. టీడీపీ, కొన్ని దుష్టశక్తులు మూడు రాజధానులను అడ్డుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానులే మా పార్టీ ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు.. కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి నిర్ణయం, విచక్షణాధికారమన్న ఆయన.. దాని మీద మంత్రులం మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు మంత్రి వర్గ మార్పుకు సంబంధం ఏముంటుంది? అని ప్రశ్నించారు. విశాఖపట్నం నుంచి రేపటి నుంచే పాలనా ప్రారంభం కావాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అని తెలిపారు. వికేంద్రీకరణ అనేదే మా పార్టీ, ప్రభుత్వ విధానంగా పేర్కొన్నారు. టీడీపీ వంటి కొన్ని దుష్టశక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కోర్టుల్లో సాంకేతిక కారణాలతో కొన్ని ఆలస్యం అవుతున్నాయన్నారు.
సీఎం వైయస్ జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. సీఎం వైయస్ జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటే పురాణాల్లో రాక్షసులు అడ్డుపడి యజ్ఞాన్ని భగ్నం చేసినట్లు ఇప్పుడు టీడీపీ, దానికి వత్తాసు పలుకుతున్న పార్టీ తీరు అలాగే ఉందన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని విమర్శించారు. అక్కడ నిజమైన రైతులు లేరని..చంద్రబాబు అండ్ కో ఉందన్నారు. రాజధాని ప్రాంతంలో పేదవాళ్లు ఉండకూడదని చంద్రబాబు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయలు ఒకే ప్రాంతంలోనే పెట్టాలా అని ప్రశ్నించారు. అమరావతి ఉద్యమ స్ఫూర్తి ఏమిటి..టెంట్‌లు వేసుకోవడమా అని నిలదీశారు.
ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు ఇంకా దిగజారిపోతాడంటూ మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. అసలు ప్రభుత్వం రద్దు చేయాల్సిన అవసరం మాకేంటని ఫైర్ అయ్యారు. మంత్రివర్గంలో మార్పులు సీఎం ఇష్టమని, కేబినెట్ ప్రక్షాళనపై వస్తున్న ఊహాగానాలపై వ్యాఖ్యానించారు. అలాగే ఒక ఎమ్మెల్సీ ఓడిపోయినంత మాత్రాన వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. మంత్రిగా ఉండి నేనే ఎమ్మెల్సీ గెలుపు బాధ్యత తీసుకున్నానన్నారు. ఎందుకు ఓడిపోయామనేది సమీక్షించుకుంటున్నామన్నారు.