*చిన్న చిన్న విషయాలకే కొందరు ఆత్మహత్యలు
*క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు పలు కుటుంబాల్లో తీవ్ర శోకం
*తాజాగా.. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థిని బలవన్మరణం
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు మందలించారన్న కారణంతో యువతి ఆత్మహత్యకు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన చిత్తూరు బైరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి చెరువులో దూకి ఇంటర్ విద్యార్థిని సంగీత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు మందలించారని సంగీత సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల వెతికినప్పటికీ.. సంగీత కనిపించలేదు. దీంతో కూతురు కనిపించలేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలోనే, బైరెడ్డిపల్లి చెరువులో ఓ మహిళ దూకినట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు ఇంటి నుంచి వెళ్లిపోయిన సంగీతగా పోలీసులు నిర్ధారించారు.
అనంతరం, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.