ఎంతటి బండరాయినైనా అదేపనిగా అలలు తాకుతుంటే, అది కరిగి మెత్తబడదా ? మంచి ఆలోచనలు, సందిగ్ధ పరిస్థితులలో వున్న హృదయాన్ని కూడా, సమస్యల పరిష్కారం వైపు నడిపిస్తాయని, భక్త రఘుదాస గాధ మనకు తెలియజేస్తుంది.
చాలాకాలం క్రిందట, ఒడిషాలోని, పిప్లి అనే సముద్రపు వొడ్డున వున్న గ్రామంలో, పూరీ జగన్నాధ మందిరం దగ్గరలో, రఘు అనే మత్స్యకారుడు వుండేవాడు. స్వతహాగా, దయాహృదయుడు, మంచివాడు. అతని ఉదర పోషణార్ధ౦ తనతల్లిని, భార్యను బ్రతికించుకోవడానికి చేపలుపట్టి, వాటిని సరసమైన ధరలకు అమ్మి, వచ్చిన డబ్బుతో జీవించేవాడు.
అయితే వృత్తిరీత్యా, తాను జీవహింసచేసి, పొట్టబోసుకుంటున్నాననే వ్యధ అతనిని నిరంతరమూ పీడిస్తూ వుండేది. తన సహజగుణమైన దయా లక్షణం ఈవృత్తి చేయడానికి అంగీకరించేది కాదు. ప్రతి రోజూ యీ విషయమైన ఆలోచనలతో రఘు నరకం అనుభవించేవాడు. హింసా అహింసల మధ్య నలిగిపోతూ వుండేవాడు.
ఒక్కొక్కసారి తనవలలో పడిన చేపలు బయటకు వెళ్లలేక గిలగిలా కొట్టుకుంటుంటే, వాటిని బయటకు వదలలేడు. దగ్గర వుంచుకోలేడు. వాటిని బజారులో అమ్మేదాకా వాటి వేపే చూస్తూ కళాహీనమైన ముఖంతో, పనులు నిర్వర్తించేవాడు. వచ్చిన డబ్బుతో తన ఆహార పదార్ధాలు కొనుక్కుంటూ, వాటిలో జీవమున్న చేపపిల్లలను చూస్తూ, రోదించేవాడు.
తన ‘ తల్లినీ, భార్యనూ పోషించడం తనవిధి. దానికి చేపపిల్లలను యెందుకు బలిపెడుతున్నాను ‘ అని పదేపదే ఆలోచించేవాడు. మిగిలిన మత్స్యకారులు ఇతనిమాటలకు నవ్వుకునేవారు. నీకక్కరలేకపోతే, ఆచేపలు మాకు ఇచ్చెయ్యమని యెగతాళి చేసేవారు. ' ఆవచ్చిన డబ్బుతో మేము నీపేరు చెప్పుకుని మజా చేసుకుంటాం ' అని కూడా అనేవారు.
కొందరు వృద్ధులు మాత్రం దగ్గర కూర్చోబెట్టుకుని, ' రఘుదాసా ! మనలను సృష్టించిన దేవుడే, చేపపిల్లలనూ సృష్టించి, మనకు ఆహారంగా చేసాడు. వాటిని మానవుడికి రుచికరంగా భగవంతుడు తయారుచేసాడంటే, ఆ చేపపిల్లల జీవన పరమార్ధం మనలను ఆనందింప జేయడమే. వాటిని కొనడానికి మనుషులు పెద్ద పెద్ద వరుసలలో నిలబడి కొంటున్నారంటే, యేమిటి అర్ధం ?
నీకింకొక సంగతి తెలుసా ? వాటిని నీవు చంపక పోయినా వేరే వాళ్ళు ఆపని చేస్తారు. నీవు ఆపగలిగేది యేమీ లేదు. ' అని రఘుదాసకి అనేక విధాలా హితబోధలు చేసేవాళ్ళు.
ఈ విధమైన వాదనలు, పాపకర్మ చేయడానికి మొగ్గుచూపేవాళ్లకు బాగుంటాయి. వారి మంచి ఆలోచనలు ప్రక్కన పడవేస్తాయి. అయితే రఘుదాస విషయంలో, యీ వాదనలు పనిచేయలేదు. ఈ చింతనలో వుండగా, రఘుదాసకి,ఒక సాధువు కనబడ్డాడు. ఆయనవద్ద తన గోడు వెళ్లబోసుకోగా, సాధువు యీతని ఆలోచనా విధానాన్ని ప్రశంసించి, ఒక తులసిమాల చేతికియిచ్చి, మానసిక స్థిరత్వంకోసం తదేక ధ్యానం చేసుకొమ్మని చెప్పాడు. అందులో, తనకు సమాధానం దొరుకుతుందని చెప్పాడు.
సాధువు చెప్పినట్లుగానే రఘుదాస తన తీరికసమయాల్లో జపము, భజనలు చేసుకుంటూ జగన్నాధుని కీర్తించేవాడు. ఈ తపస్సు ఉద్ధృతి పెరిగినప్పటినుండీ, అపరాధనా భావన యింకా యెక్కువ కాజొచ్చింది, రఘుదాసకి. తనలోతను రోదించడం అధికమైంది. తనవలన మత్స్య సంతతికి జరుగుతున్న హాని చూసి తట్టుకోలేక పోతున్నాడు. వాటిమీద పెట్టిన కత్తి, తన గొంతుమీద పెట్టినట్లు చలించి పోతున్నాడు.
ఇలా కాలం గడుస్తుండగా, ఒకానొక రోజు, రఘుదాస, ఆనాటితో, తన జాలరి జీవితానికి స్వస్తి పలకాలనుకున్నాడు. అలా అనుకుంటూనే, తన అతిపెద్ద వలను, సముద్రం లోకి విసిరాడు.
అప్పుడే... అప్పుడే.. ఒక అద్భుతం జరిగింది. కనులు మిరుమిట్లు గొలిపేటట్లు ఒకపెద్ద యెర్రని మత్స్యం రఘుదాస వలలో చిక్కింది. దానిని చూడగానే, రఘుదాస మత్స్యావతారంలో, శంఖాసురుని వధించిన శ్రీమహావిష్ణువు గా దానిని భావించి ఒక్క అడుగు వెనుకకు వేసి, దానిని వలలోనుండి తప్పించబోయాడు.
వెంటనే దీనమైన ముఖాలతో తనతల్లి, భార్య అతని కండ్ల ముందు మెదిలారు. ఆ చేపను పైకి తీసి, దాని మెడపై కత్తి పెడుతూ, ' ఓ మత్స్య రాజమా ! నా వృత్తి ధర్మం నిన్ను చంపమని చెబుతున్నది.. నీవు విష్ణువువే అయినా, అది నీ తప్పే. ఎందుకంటే, నన్ను మత్స్యకారుడిగా పుట్టించింది నువ్వే కదా ! ' అని తనను తాను సమర్ధించుకుంటూ, ఆ మత్స్యాన్ని చంపబోయాడు.
అప్పుడే ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ పెద్ద చేప నుండి వినవచ్చినట్లుగా, ' నారాయణా ! నన్ను రక్షించవా ! ఓ నారాయణా ! నన్ను రక్షించవా ! ' అన్న మాటలు రఘుదాస స్పష్టంగా విన్నాడు.
సందిగ్ధంలో వున్న రఘుదాసకి పరిష్కారం దొరికింది. వెంటనే, ఆనందాశ్రువులు స్రవిస్తూ, ఆ మత్స్యరాజాన్ని, జాగ్రత్తగా తీసుకుని వెళ్లి, కొద్దిదూరంలో వున్న సరస్సులో వదిలి, వేరే యే మత్స్యకారునికీ దొరకకుండా, జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆచేప గంతులు వేసుకుంటూ, సరస్సులోకి యెగురుకుంటూ పోతుంటే, రఘుదాస గుండెలు కూడా ఆనందంతో గంతులు వేసాయి.
మత్స్యరాజానికి జీవితం ప్రసాదించిన రఘుదాస తనకు కూడా కొత్త జీవితం వచ్చినట్లు భావించాడు. ఇంటికి తిరిగి వెళ్లకుండా, అడవులలో తిరుగుతూ, విష్ణునామం జపిస్తూ వుండిపోయాడు. ' హే భగవాన్ ! నీ స్వరం ఆ చేపద్వారా వినిపించావు. కానీ నాకు తృప్తి కలగడంలేదు. నీ దివ్యమంగళరూపాన్ని చూపించు. అంతకంటే యింక నిన్నేమీ కోరను. ' అంటూ జపతపాది ధ్యానాలు చేయ్యసాగాడు రఘుదాస.
ఆ విధంగా మూడు రోజులు గడిచిపోయాయి. కానీ రఘుదాసకి ఈవిషయం తెలియదు. కాలం మీద ధ్యాస వుంటే కదా తెలిసేది. అతని సంపూర్ణ శరణాగతి ఆకలిదప్పులు, కాల ప్రదేశాలకి అతీతంగా నిలిచిపోయింది.
ఆసమయంలో, ఒక ముదుసలి రూపంలో విష్ణువు ప్రత్యక్షమై, రఘుదాసని ఇక్కడ ఎందుకున్నావని అనేక విధమైన ప్రశ్నలతో విసిగిస్తూ, పరీక్షించసాగాడు. అయితే, రఘుదాస వినయంగానే సమాధానం చెప్పి, తనకు విష్ణు సాక్షాత్కారం కావాలన్నాడు. ఆయన యింకా ప్రసంగం పొడిగిస్తుంటే, తనకు కాలక్షేప ప్రసంగాలమీద ఆసక్తిలేదన్నాడు. తనను ధ్యానం చేసుకోనిమ్మని కోరాడు. ' నేను వెల్తానుగానీ, నీవు అమాయకుడిలాగా కనిపిస్తున్నావు ? చేప మాట్లాడడమేమిటీ ? ఆ విషయం పట్టుకుని నీవు అడవులలో తల్లినీ, భార్యనీ వదిలిపెట్టి, తిరగడమేమిటీ ? నేనే చేపరూపంలో మాట్లాడాను. ఇక తృప్తిగా యింటికివెళ్ళు ' అంటూ ఆవృద్ధుడు వెళ్ళబోయాడు.
ఆయన మాటలకు రఘుదాసకి చెళ్ళున చరిచినట్లైంది. నేను చెప్పకుండానే చేప మాట్లాడడం గురించి చెప్పాడు. నా తల్లినీ, భార్యనూ గుర్తుచేశాడు. శ్రీహరి సాక్షాత్కరించి వుంటాడని అనుకుని, ' స్వామీ ! నాకు తృప్తిగా లేదు. నాకు నీ నిజరూప దర్శన భాగ్యంకలిగించు. ' అనికొరగానే, మహావిష్ణువు, శంఖ, చక్ర, గదా పద్మాలను నాలుగు చేతులా ధరించి రఘుదాసకి దర్శనమిచ్చాడు. త నకు మళ్ళీ ఆ చేపలు పట్టే అవసరంలేకుండా వరమిమ్మని అడిగాడు రఘుదాస. ' తధాస్తు ' అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు.
రఘుదాస, ఆనందంగా హరిభజన చేసుకుంటూ, యిల్లు చేరాడు. ఇంటికి చేరగానే, చుట్టుప్రక్కల వాళ్ళు, రఘుదాసని చివాట్లు పెట్టారు, తల్లినీ, భార్యను వదలి వెళ్లినందుకు. ఆ మూడురోజులూ, వారికి, ఊరి జమీందారు రక్షణ కలిపించాడని తెలుసుకుని, ఆ శ్రీహరి జమీందారు రూపంలో వారికి ఆశ్రయమిచ్చాడని జమిందారుని స్తుతించాడు.
ఇప్పుడు రఘుదాస, ప్రతిజీవిలో భగవంతుని చూడడం అలవాటు చేసుకున్నాడు. అతని వృత్తీ, ప్రవృత్తీ, హరినామమే అయిపొయింది. తన దేహాన్ని తననుండి విడగొట్టుకున్న అనుభూతి పొందసాగాడు. రోజుల తరబడి యెక్కడో ఒకచోట కూర్చుని ధ్యానం చేసుకుంటుంటే, ఆకతాయి పిల్లలు ఆయనను బాధించసాగారు. అవేమీ ఆయన ధ్యానానికి అంతరాయం కలిగించలేదు.
ఒకసారి, ఒక కొంటె కోణంగి, ముళ్లకర్రతో, ఆయన వీపుమీద అదేపనిగా కొట్టినాకూడా, చలనం లేకుండా ధ్యానసమాధిలో వుండి, తరువాత అక్కడనుండి లేచి వెళ్ళిపోయాడు రఘుదాస. రఘుదాస లేచివెళ్లిన కొద్దిసేపటికి, ఆ ఆకతాయి, రఘుని కొట్టిన ప్రదేశంలో రక్తం కక్కుకుని చనిపోయాడు.
అదిచూసి, ఆ పిల్లవాని తల్లిదండ్రులు, ' రఘుదాస ! మా పిల్లవాడు చెడ్డపనులు చేస్తున్నా, మేము అతనిని నిలువరింపలేక పోయాము. ఇప్పుడు నీ ఆగ్రహానికి గురై చనిపోయాడు. మాకు వాడు ఒక్కడే కొడుకు. దయచేసి, అతనిని బ్రతికించు. ' అని రఘుదాసని ప్రార్ధించారు.
రఘుదాస నిర్వికారంగా, నాకు ఆ బాలునిపై యే విధమైన ఆగ్రహంలేదనీ, ఆ కొట్టినదెవరో కూడా చూడలేదని, కొట్టినట్లు తనకు తెలియదనీ చెబుతూ, ఆబాలుని మృతదేహం వద్ద కూర్చుని హరినామ స్మరణ చేస్తూ, అందరినీ చెయ్యమన్నాడు. అలా అందరూ హరిని కీర్తిస్తుండగా, కొద్దిసేపటికి ఆ పిల్లవాడు లేచికూర్చుని, రఘుదాసకు నమస్కరించి, వాడి తల్లిదండ్రుల దగ్గరకు చేరాడు. బుద్ధిగా వుంటానని రఘుదాస కాళ్లకు నమస్కరించి చెప్పాడు. ఆ నాటినుండి, రఘుదాసకి భక్త సందోహం యెక్కువయింది.
రఘుదాసుకి వాక్సుద్ధి ఉందనీ, ఆయన శ్రీహరిని ప్రార్ధించి మనకు యేమి కావాలన్నా ఇప్పిస్తాడనీ, ప్రచారం జరిగింది. ఈ భక్తుల తాకిడికి రఘుదాస తట్టుకోలేక, ఒంటరి ప్రదేశాలలో ప్రశాంతంగా హరిధ్యానంలో గడుపసాగాడు. అతని ప్రమేయం లేకుండానే, జాలరివృత్తి చేయకుండానే, అతని తల్లికీ, భార్యకు అన్ని వసతులూ కలుగుతున్నాయి, గ్రామస్తుల సహకారంతో. శ్రీహరి యిచ్చిన వరం ఆవిధంగా రఘుదాస కుటుంబసభ్యుల విషయంలో కూడా నెరవేరింది.
ఒకరోజు రఘుదాస తన యింటికివచ్చి ధ్యానంలో వుండగా, జగన్నాధస్వామి వచ్చి, తనకు యేదైనా పెట్టమని కూర్చున్నాడు, రఘుదాస దగ్గర. తన దగ్గర వున్న ఆహారం తీసి పెట్టేలోపే, తన కరస్పర్శతో జగన్నాధుడు, రఘుదాసుని చేతిలో ఆహరం తీసుకుని ఆనందంగా తింటున్నాడు.
అక్కడ పూరీలో జగన్నాధునికి ప్రతిరోజూ, అద్దంలో ఆయన ప్రతిబింబానికి, మహారాజు తీసుకువచ్చిన అహారం పండాగారు పెట్టే నియమం వున్నది. అయితే, ఆరోజు మహారాజు తీసుకువచ్చిన ఆహరం తినడానికి, జగన్నాధుడు బింబరూపంలో కనబడలేదు.
ఈ హఠాత్పరిణామం చూసి, మహారాజు అక్కడికక్కడే మూర్చపోయాడు. తన వలన యేమైనా అపరాధం జరిగిందేమో అని వగచాడు. అప్పుడు ఆయనకు జగన్నాధుడు కనబడి, ' రాజా ! నేను యిప్పుడు పూరీలో లేను. పిప్లి లో వున్నాను. రఘుదాస యింటిలో అతని చేతిమీదుగా భోజనం చేస్తున్నాను. నీవు అతనిని పూరీకి తీసుకువచ్చి, నా సేవలకు ఉపయోగించుకో, అతని కుటుంబాన్ని కూడా ఆదుకో ! ' అని చెప్పాడు.
వెంటనే మహారాజు పిప్లి గ్రామం వెళ్లి, రఘుదాసని యిల్లు గుర్తించి, ఆయనను సాదరంగా పూరీకి తోడ్కొని వచ్చాడు, కుటుంబంతో సహా. అప్పటినుండి రఘుదాస అతని కుటుంబం, శేషజీవితంలో, యేవిధమైన, తాపత్రయాలు లేకుండా, సందిగ్ధ పరిస్థితులు తలెత్తకుండా, స్వామి ఆశీర్వాదంతో, ఆయన సేవలో గడిపి, చరమాంకంలో పరమాత్ముని సన్నిధి చేరుకున్నారు...
🍁సర్వేజనాసుఖినోభవంతు 🍁