20న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

4/18/2023 4:17:30 PM


 తిరుమల, ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏప్రిల్: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 20న ఉదయం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

*శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా....

      శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.

*ఏప్రిల్ 21న అంగప్రదక్షిణం టోకెన్లు....

       జూలై నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

*వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా...

 వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

*ఏప్రిల్ 24న వర్చువల్ సేవల కోటా విడుదల

       వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు, జూన్ నెల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

*ఏప్రిల్ 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

   మే, జూన్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల  చేయ‌నుంది.

     తిరుమలలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు, తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

      భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

Name*
Email*
Comment*