విశాఖ నుంచి పాలన సెప్టెంబరు నుంచే

4/19/2023 8:02:49 PM


. తాడేపల్లిని వీడి విశాఖకు బస మార్పు 
. మళ్లీ తెరపైకి రాజధానుల విషయం
. సీఎం జగన్‌ ప్రకటనపై విపక్షాల మండిపాటు 
. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నిక ఓటమిని 
  అధిగమించే ఎత్తుగడే ఇదీ
. వివేకా హత్య చర్చనుంచి దృష్టిని మళ్లించడానికే...
(శ్రీకాకుళం, ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌ ప్రత్యేక ప్రతినిధి) 
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ నుంచి పరిపాలనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తేల్చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసిన సమయంలో ఆయన మరోసారి పరిపాలన రాజధానిపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు.  పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే కాపురం పెట్టనున్నట్టు స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ నుంచే విశాఖ కేంద్రంగా పరిపాలన మొదలు పెట్టనున్నట్టు జగన్‌ ప్రకటించడం రాజకీయ చర్చకు దారితీస్తోంది. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే తలంపుతోనే అన్ని జిల్లాల అభివృద్ధి చేపట్టామన్నారు. రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ అని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌ నుంచే విశాఖకు మకాం మారుస్తున్నట్టు సీఎం ప్రకటించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎందుకంటే జగన్‌ సర్కార్‌ తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుల్ని ఏపీ హైకోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ సర్కార్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ పిటిషన్లపై విచారణ చేపట్టాల్సి ఉంది. ఇటీవల విచారణలో భాగంగా త్వరగా తేల్చాలని ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఒకవైపు సుప్రీంకోర్టులో రాజధాని అంశం పెండిరగ్‌లో ఉండగానే, సీఎం జగన్‌ ఏకంగా సెప్టెంబర్‌లో విశాఖ నుంచి పరిపాలన మొదలు పెడతామనడం కేవలం రాజకీయ ఎత్తుగడగా విపక్షాలు విమర్శిస్తున్నాయి.  ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్‌ వ్యూహాత్మకంగా విశాఖ నుంచి పాలన అంటూ సంచలన ప్రకటన చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
రెండు నెలల కిందటా ఇదే మాట...
రెండు నెలల కిందట ఢల్లీిలో జీ2 సమ్మిట్‌ సమీకరణలో భాగంగా జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ ‘మీ వెంట నేను విశాఖ వచ్చేస్తున్నా’నని ప్రకటించి వేడి పుట్టించినా ఆ పని జరగలేదు. ఉగాది నాటికి జగన్‌ వచ్చేస్తున్నారని, ప్రధాన కార్యాలయాలు, సీఎం క్యాంపు కార్యాలయాలు ఫలానా చోట్ల సిద్ధమైపోయాయని ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈయన మాటలకు వత్తాసు పలుకుతూ ఉత్తరాంధ్ర మంత్రులు కూడా అదే విషయాన్ని వెల్లడిరచడంతో ఓ పది, పదిహేను రోజులపాటు హడావుడి సాగింది.  ఓ వైపు ఆ వివాదం సుప్రీంలో ఉండగా అలా ఎలా చెబుతారని వైసీపీ వ్యతిరేకులంటే...సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని వైసీపీ మంత్రులు కౌంటర్లు ఇచ్చారు. ఆ తరువాత ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలు రావడంతో ఆ కదలిక తాత్కాలికంగా ఆగిపోయింది. అనంతరం ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలవడంతో ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ ఏమీ లేదని, విశాఖలో పరిపాలనా రాజధాని విషయాన్ని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఓటర్లు ఏమీ పట్టించుకోలేదని విపక్షాలు దుమ్మెతిపోయడంతో ఉత్తరాంధ్ర వైసీపీ నేతల వాయిస్‌ కాస్తా తగ్గింది. వైసీపీ డీలా పడిపోయి...టీడీపీ జోష్‌ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు నుంచే విశాఖకు వచ్చేస్తున్నానని, అక్కడనుంచే పరిపాలన సాగిస్తానని సీఎం జగన్‌ బహిరంగ సభలో హర్షధ్వనాల మధ్య ప్రకటించారు. దీంతో మళ్లీ రాజధానుల రగడ చర్చకు వస్తోంది. సెప్టెంబరు నెల అంటే...ఇంకా మధ్యలో నాలుగు నెలలే ఉంది. సుప్రీం తీర్పు కూడా ఈ మధ్యలో వచ్చేయవచ్చు. ఆ తీర్పు వైసీపీకి అనుకూలంగా వస్తే సరే లేకుంటే విశాఖలో బస ఏర్పాటు చేసి అమరావతిని కూడా ఇక్కడ నుంచే డీల్‌ చేస్తామనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 
వివేకా హత్య కేసునుంచి దృష్టి మళ్లించడానికే...
వివేకా హత్యోదంతం వైఎస్‌ జగన్‌కు రాజకీయంగా నష్టం తెస్తోంది. సొంత చిన్నాన్న హత్య కేసులో నిందితులను జగన్‌ వెనకేసుకొస్తున్నారనే అపప్రదను ఆయన మూటకట్టుకోవాల్సి వస్తోంది. దీంతో ఈ చర్చ నుంచి ఏపీ సమాజాన్ని పూర్తిగా పక్కదారి పట్టించేందుకు మరోసారి రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో విశాఖలో సెప్టెంబర్‌ నుంచి కాపురం అనే మాటతో ఏపీ రాజకీయాలు పూర్తిగా రాజధాని అంశం చుట్టూ తిప్పాలనేది జగన్‌ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది తనకు లాభమే తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం తీసుకురాదని జగన్‌ నమ్మకం. సెప్టెంబర్‌ నుంచి విశాఖ కేంద్రంగా తాను పాలన మొదలు పెట్టాలని అనుకున్నారని, టీడీపీ, పచ్చ దళం కుట్రపూరితంగా అడ్డుకుంటోందంటూ ప్రచారం చేసుకోడానికి ఆయుధం దొరుకుతుందని వ్యూహాత్మకంగా మాట్లాడారని అంటున్నారు.  ఒకవేళ సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్‌కు వ్యతిరేకత తీర్పు వచ్చినా, ఇదంతా టీడీపీ కుట్రగా చంద్రబాబును ఉత్తరాంధ్రలో దోషిగా నిలబెట్టాలని జగన్‌ పథక రచన చేశారు. జగన్‌ వ్యూహం ఎంత వరకూ ఫలిస్తుందో వేచి చూడాల్సి వస్తోంది.

Name*
Email*
Comment*