మా పాపే.. కాదు!

5/20/2023 11:09:03 AM

శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన దంపతులు వాదన

కరీంనగర్‌ జిల్లా, ఎక్స్ ప్రెస్ న్యూస్ మే20: 
ఎనిమిదేండ్ల చిన్నారి తమ కూతురంటూ రెండు కుటుంబాలు పోటీపడుతున్నాయి. తమ పాపేనంటే.. కాదు తమ పాపేనంటూ పట్టుబట్టిన ఘటన శుక్రవారం కరీంనగర్‌ బాలరక్షా భవన్‌లో చోటుచేసుకున్నది. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం ఎగ్లాస్‌పూర్‌కు చెందిన గాదెపాక లక్ష్మి కొద్దిరోజులుగా అక్ష అనే చిన్నారిని తన ఇంట్లో సంరక్షిస్తున్నది. బాలిక ఆంధ్రా యాసలో మాట్లాడుతుండగా, అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సదరు బాలికను హైదరాబాద్‌లోని ఆండాళ్‌ అనే మహిళ ద్వారా తెచ్చుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఈనెల 8న బాలరక్ష భవన్‌లో చిన్నారిని అప్పగించారు.

ఐదేండ్ల క్రితం తప్పిపోయిన చిన్నారి సమాచారాన్ని ఏపీలోని స్త్రీ,శిశు సంక్షేమ శాఖకు చేరవేయగా, విషయం తెలుసుకున్న తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కర్ర గ్రామానికి చెందిన రేపల్లి పద్మ, భగవాన్‌దాస్‌ దంపతులు, శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్లకు చెందిన పొన్నాడ రవిచంద్రన్‌ కుటుంబాలు శుక్రవారం కరీంనగర్‌లోని బాలరక్ష భవన్‌కు చేరుకున్నాయి. చిన్నారిని చూసిన ఇరు కుటుంబాల వారు తమ పాపేనని, తమకే అప్పగించాలని ఎవరికి వారు పట్టుబట్టారు. అయితే చిన్నారి అక్షను వారి ఎదుట ప్రవేశపెట్టగా తల్లిదండ్రులను గుర్తుపట్టలేకపోయింది. సరైన ఆధారాలు అందజేయాలని, లేకుంటే డీఎన్‌ఏ పరీక్ష అనంతరం పాపను సరైన తల్లిదండ్రులకు అప్పగిస్తామని బాలరక్ష భవన్‌ అధికారులు తేల్చిచెప్పారు...

Name*
Email*
Comment*