*అయినా ఆగని సరదాలు
- జొన్నాడలో ఇరువురు మృతి
అంబేడ్కర్ కోనసీమ జిల్లా: గోదారమ్మకు వరదలు వచ్చి ఉగ్రరూపం దాల్చితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి.అయితే వరదలు వచ్చినప్పుడు అంతగా ప్రమాదాలు జరగి ప్రాణనష్టం జరగటం లేదు.కాని అంతగా నీరు లేని సమయంలోనే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం విషాదకరమైన విషయం. వేసవిలో గోదావరి పరివాహక ప్రాంతాలలో ఇటువంటి ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. వేసవిలో ఆటవిడుపుగా ఆహ్లాదకరంగా ఉండే గోదావరి ఒడికి వెళ్లడం సహజమే. అక్కడితో ఆగితే పర్వాలేదు. నీరు లేదు కదా... ఎంతో లోతుండదని సరదాకి దిగితే దొంగ ఊబులకు చిక్కుకుని ప్రాణాలను పోగొట్టుకోవాల్సిందే.చూడటానికి అడుగు లోతులో ప్రవహించే నీరు మాత్రమే కనిపిస్తుంది. కాని అందులో దిగితే దొంగ ఊబులు మట్డు పెట్టడానికి మాటు వేసుకుని ఉంటాయి.
ఈ ప్రమాదకరమైన ఊబిల గురించి ఆ ప్రాంతంలో ఉండే స్థానికులకు తప్ప ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తెలియదు. అందుకనే ఎక్కువగా ప్రమాదాలకు ఇతర ప్రాంతాలకు చెందిన వారే గురవుతుంటారు. అందుకునే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ముందుగానే సంబంధిత పోలీసులు, స్థానికులు గుర్తించి ఆ ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేస్తుంటారు.అయినా లెక్క చేయకుండా గోదావరిలో దిగి ప్రాణాలు కోల్పోతారు.
జొన్నాడలో ఇరువురు మృతి
తాజాగా ఆదివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో ఇద్దరు యువకులు ఆ విధంగానే ఈ గోదావరిలో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ మండలంలో అత్యధికంగా బడుగువానిలంక వద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ గ్రామానికి ఆనుకుని ఉండే సుమారు ఆరు కిలోమీటర్ల పరిధిలో అనేక పాయలు ఉంటాయి. ఆలమూరు మండలం తో పాటు కడియం, మండపేట ప్రాంతాల నుంచి వేసవికాలంలో ఈ గోదావరి సరదాలకు వస్తూ ఉంటారు. అనుకోకుండా ఈ దొంగ ఊబిలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతారు. అందుకనే ముందు జాగ్రత్తగా రెండు రోజులు క్రితమే పలు రేవులు వద్ద పోలీసులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి అప్రమత్తం చేశారు. అయితే ఈసారి జొన్నాడలో ప్రమాదం జరగడం బాధాకరం.కొత్తపేటకు చెందిన గెద్దాడ కరణ్ కుమార్(22),అయినవిల్లి మండలం పెద్దపాలెంకు చెందిన మోటూరి త్రిలోక్(18)లను గోదావరి ఊబులు ప్రాణాలు తీసాయి.ఆరుగురు యువకులు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి వచ్చారు. అనంతరం ఆరుగురూ స్నానానికి దిగిగా అందులో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన నలుగురు సురక్షితంగా బయట పడ్డారు. కేవలం ఈ గోదావరి ప్రవాహంపై వారికి ఎలాంటి అవగాహన లేక పోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు చోటు చేటుచేసుకుంటున్నాయి. పైగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇటీవల నే ఇసుక తవ్వకాలు జరిగాయి. ఆ విషయం తెలియక వారు ప్రమాదానికి గురై నట్లు తెలుస్తుంది.