కేతేపల్లి: ఎండలు మండుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మూసీ ప్రాజెక్టు నీటితో నిండికుండలా తొణికిసలాడుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు ఈఏడాది నీటితో కళకళలాడుతోంది*.
ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలోకి వచ్చింది. 2022-23 సీజన్‌లో వానాకాలం, యాసంగిలో(రెండు పంటలకు) సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలోని దాదాపు 35వేల ఎకరాల ఆయకట్టు భూముల్లో పంటల సాగుకు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. యాసంగి సీజన్ పంటకాలం పూర్తయిన తర్వాత ఏప్రిల్ 10న సాగునీటిని విడుదల చేసే సమయానికి 645 అడుగులు గరిష్ట నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం 622 అడుగులకు తగ్గిపోయింది.
గతంలో ఒకే పంటకు..
మూసీ ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిగా వర్షాధారం పైనే ఆధారపడి నిండుతుంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేవలం ఒకే పంటకు వారబందీ పద్ధతిలో ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని విడుదల చేసేలా డిజైన్ చేసి నిర్మించారు. వానాకాలం సీజన్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలకు ప్రాజెక్టు నిండితే యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు డిసెంబర్ మాసంలో వారబందీ పద్ధతిని నీటిని విడుదల చేసేవారు. కానీ ఐదారేళ్లుగా వేసవి కాలంతో పాటు, వానాకాలం ప్రారంభంలోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో మూసీ రిజర్వాయర్‌లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుతుంది. దీంతో యాసంగితో పాటు వానాకాలం సీజన్‌లో కూడా ఆయకట్టులో రెండు పంటల సాగుకు నీటిని విడుదల చేస్తున్నారు.
20అడుగులు పెరిగిన నీటిమట్టం
గత ఏప్రిల్ మాసం నుంచి మూసీ ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్, జనగాం ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ, బిక్కేరు వాగుల ద్వారా నిరంతరాయంగా నీరు వస్తుండటంతో వేసవిలో ప్రాజెక్టులో నీటిమట్టం ఒక్కో అడుగు పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 641.75 అడుగులకు చేరుకుంది. అంటే గత ఏప్రిల్ నుంచి నేటి వరకు దాదాపు 20అడుగుల మేర నీరు చేరింది. గరిష్ట నీటిమట్టానికి కేవలం మూడున్నర అడుగుల దూరంలో మాత్రమే ఉంది. ఎగువ నుంచి 633 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.63 టీఎంసీల నీరు నిల్వ ఉంది . మూసీ ఎగువ, పరీవాహక ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురిసి ఏ మాత్రం ఇన్‌ఫ్లో పెరిగినా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశముంది. వానాకాలం సీజన్‌లో ఆయకట్టులో పంటల సాగుకు నీటి విడుదలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తే ఆమేరకు సకాలంలో సాగు పనులు మొదలు పెట్టవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రెండు పంటలకు సిద్ధమవుతున్న
మూసీ ఆయకట్టు కింద నాకున్న రెండెకరాల భూమితో పాటు మూడు ఎకరాలు కౌలుకు చేస్తున్నా. గతంలో ఏటా ఒక పంటగా వరి సాగు చేసేవాన్ని. ఐదారేళ్ల నుంచి రెండు పంటలు సాగు చేస్తున్నాను. ఈసారి కూడా రిజర్వాయర్‌లో నీరు పుష్కలంగా ఉంది. వానాకాలం, యాసంగిలో పంటలు సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా.
- పడాల లింగయ్య, రైతు, కేతేపల్లి
గేట్ల నిర్వహణ పనులు పూర్తి చేశాం
ప్రస్తుత వేసవిలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువలోకి రావటంతో గేట్ల నిర్వహణ పనులను ఇటీవల పూర్తి చేశాం. గ్రీజింగ్, ఆయిల్ మార్చటం వంటి పనులు నిర్వహించాం. ప్రాజెక్టు వద్ద సిబ్బందిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరిస్తున్నాం.
- చంద్రశేఖర్‌రెడ్డి, డీఈ, మూసీ ప్రాజెక్టు
ఫ ఎగువ నుంచి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
ఫ పూర్తిస్థాయి నీటి మట్టానికి మూడున్నర అడుగుల దూరంలో ప్రాజెక్టు
ఆనందంలో ఆయకట్టు రైతులు