సిద్ధిపేట జిల్లా, ఎక్స్ ప్రెస్ న్యూస్, జూన్ 01: సిద్ధిపేట శివారు మందపల్లి నుంచి రైల్వే ట్రాక్ లైను పనులు రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య మంత్రి హరీష్‌రావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్ధన్ బాబు, సిద్ధిపేట ఆర్డీఓ రమేశ్ బాబు, ఇతర అధికార యంత్రాంగంతో కలిసి క్షేత్రస్థాయి రైల్వే ట్రాక్ పనులను మంత్రి పరిశీలించారు. సిద్ధిపేటకు తొందరలోనే రైలు కూత వచ్చేలా యుద్ధప్రాతిపదికన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. సిద్ధిపేట రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో జాప్యం జరగొద్దని, పనుల వేగం పెంచాలని రైల్వే శాఖ అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దుద్దెడ - సిద్ధిపేట వరకూ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులలో భాగంగా చేపట్టిన ట్రాక్ నిర్మాణ పనుల గురించి మంత్రికి రైల్వే శాఖ అధికారులు వివరించారు. దుద్దెడ - సిద్ధిపేట రైల్వే ట్రాక్ పనులలో భాగంగా మందపల్లి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ జాప్యంపై ఆరా తీసి, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.