హైదరాబాద్, ఎక్స్ ప్రెస్ న్యూస్, జూన్ 13: ఈ నెల 17న దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించనున్న ఫ్లైట్ కేడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సీజీపీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. పరేడ్ రివ్యూయింగ్ ఆఫీసర్‌గా హాజరవుతున్న రాష్ట్రపతి యువ కేడెట్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. శిక్షణ పూర్తి చేసిన యువ కేడెట్లను భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లో విధుల్లో చేరుతున్న వారితో ప్రతిజ్ఞ చేయించనున్నారు. శిక్షణ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఫ్లైట్ కేడెట్‌కు రాష్ట్రపతి గౌరవ కరవాళాన్ని ద్రౌపదీముర్ము బహూకరిస్తారు. అనంతరం భారత వాయుసేనతోపాటు భారత నేవీ, ఇండియన్ కోస్ట్‌గార్డ్, భారత్‌తో మైత్రి బంధంలో ఉన్న దేశాల నుంచి ఈ బ్యాచ్‌లో శిక్షణ పొందిన ఫ్లైట్ కేడెట్లకు సైతం రాష్ట్రపతి అవార్డులను అందించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.