*“ప్రపంచ రక్త దాత దినోత్సవాన్ని” సి.ఆర్. మీడియా అకాడమి సన్మానం
విజయవాడ, ఎక్స్ ప్రెస్ న్యూస్ జూన్. 13: రక్త దాన ప్రాముఖ్యత తెలిపేందుకు, రక్త దాతలను అభినందించేందుకు మీడియా అకాడమి తన వంతు బాధ్యతను నిర్వహిస్తోందని సి.ఆర్. మీడియా అకాడమి చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు అన్నారు. స్థానిక సి.ఆర్. మీడియా అకాడమి కార్యాలయంలో “ప్రపంచ రక్త దాత దినోత్సవాన్ని” పురస్కరించుకుని మంగళవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రక్తదానం చేసిన పాత్రికేయులు, ఇతర రంగాల వ్యక్తులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రక్త దానం ద్వారా ప్రాణ దానం చేస్తోన్న స్వచ్ఛంద రక్త దాతలకు కృతజ్ఞతలు తెలుపుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. , సామాజిక స్పృహ తో అత్యంత విలువైన రక్తాన్ని ఇచ్చి ఆపదలో వున్నవారిని ఆదుకుంటున్న అందరూ అభినందనీయులే అని ఆయన అన్నారు. ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో ఒకే రోజు 35 వేల యూనిట్లు రక్తదానం చేసిన వారందరికీ ఈ సందర్బంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం లో స్వచ్ఛంద రక్త దాతలను గుర్తిస్తూ, వారి ద్వారా సేకరించిన రక్తాన్ని పేదలకు, ఆపదలో వున్నవారికి ఉచితంగా అందిస్తోన్న రెడ్ క్రాస్ సొసైటీ ని గౌరవించడమంటే, మనల్ని మనం గౌరవించుకున్నట్టే అని ఆయన అన్నారు. ఈ సందర్బంగా రెడ్ క్రాస్ సొసైటీఆంధ్ర ప్రదేశ్ శాఖ కో ఆర్డినేటర్ శ్రీ బి.వి.ఎస్. కుమార్, విజయవాడ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ డా. టి.వి. రమణా రావు లను చైర్మన్ శాలువాతో సత్కరించారు.
ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం అభివృద్ధికి కీలకమైన విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత నిస్తోన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందుకు తగినట్టుగా బడ్జెట్ కేటాయింపులు చేస్తూందన్నారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, పౌష్ఠిక ఆహరం అందించడం వంటి అనేక కార్యక్రమాల తోడు, మౌలిక సౌకర్యాల ను కల్పించే ప్రయత్నాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం చేస్తోందన్నారు.
రెడ్ క్రాస్ సొసైటీఆంధ్ర ప్రదేశ్ శాఖ బ్లడ్ బ్యాంక్స్, ప్రాజెక్ట్స్ కో ఆర్డినేటర్ శ్రీ బి.వి.ఎస్. కుమార్, మాట్లాడుతూ, ఒకరి రక్త దానం ద్వారా ఒకరి ప్రాణం కాపాడవచ్చన్నది పాత కాలపు నినాదం అన్నారు. ప్రస్తుతం ఒకరి రక్త దానం తో ముగ్గురి ప్రాణాలు కాపాడడం జరుగుతోందన్నారు. అత్యఆధునిక బ్లడ్ బంకులు కలిగిన రెడ్ క్రాస్ సొసైటీ సేకరించిన రక్తాన్ని ఎర్రరక్తకణాలు, ప్లాజ్మా, ప్లేట్ లెట్స్ అనే మూడు భాగాలుగా విభజించి భద్ర పరుస్తోందన్నారు. తద్వారా, ఆపద లో వున్నముగ్గురికి మేలు చేకూర్చడం జరుగుతోందన్నారు. ఈ విధంగా రాష్ట్రం లోని 18 రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకుల ద్వారా, గత యేడాది 97 వేల యూనిట్ల రక్తాన్ని ఉచితంగా ఆపదలో వున్నవారికి ఇవ్వడం జరిగిందన్నారు. 'తలసేమియా' అనే ప్రత్యేక వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రతి 3 నెలలకు ఒక సారి రక్త మార్పిడి చేయాలని, ఇటువంటి పిల్లల తల్లిదండ్రులకు,రెడ్ క్రాస్ సొసైటీ పూర్తి ఉచితంగానే రక్తం అందిస్తోందన్నారు. ప్రతి యేటా రాష్ట్రం లో 70 వేల యూనిట్లు మేర రక్తం కొరత ఏర్పడుతోందన్నారు. దీన్ని అధిగమించేందుకు ఎన్. సి.సి.,ఎన్ .ఎస్.ఎస్ విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ చేసి, వారి బ్లడ్ విభాగం తెలిపే కార్డులు అందచేస్తున్నామని, వారికి రక్త దానం ఆవశ్యకత, ప్రాధ్యాన్యత తెలిపే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అవసరమైనపుడు రక్త దానం చేస్తామంటూ రాష్ట్రం లో ఒక లక్షా 20 వేల మంది ముందుకొచ్చారని ఆయన తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వారితో "రక్త దాన ప్రతిజ్ఞ" ఆయన చేయించారు.
విజయవాడ బ్లడ్ బ్యాంక్ వైద్య అధికారి,డా. టి.వి. రమణ రావు మాట్లాడుతూ 2023 సంవత్సర రక్త దాత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ "రక్తాన్ని ఇవ్వండి, ప్లాజ్మా దానం చేయండి, జీవితాన్ని పంచుకోండి" అనే నినాదాన్ని ఇచ్చిందన్నారు. వైద్య రంగం లో ఆధునిక పరిశోధనలు గుండె మార్పిడి, సహా వివిధ అవయవాల మార్పిడిని విజయవంతంగా చేస్తోన్నా, కృత్రిమ రక్తాన్ని కనుగొన లేకపోయిందన్నారు. ఇందువల్లే రక్త దానం అత్యంత విలువైనదన్నారు. తరచూ రక్తాన్ని ఇస్తే అనారోగ్యం పాలవుతారన్న అభిప్రాయం నిజం కాదన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ జి. ఆంజనేయులు మాట్లాడుతూ, సమాజంలో రక్త దానం, అవయవ దానం వంటి అంశాలపై చైతన్యం పెరిగిందన్నారు. ఇందుకు దోహద పడిన రెడ్ క్రాస్ సొసైటీ స్సంస్థలు, దాతలు అభినందనీయులు అన్నారు. పలువురు పాత్రికేయులు రక్తదానం చేస్తూ సామాజిక సేవ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గతం లో తాము రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించిన సంగతి ఆయన గుర్తు చేసుకున్నారు.
సి.ఆర్. మీడియా అకాడమి సెక్రెటరి శ్రీ ఎం. బాలగంగాధర తిలక్ మాట్లాడుతూ రక్తపు చుక్కలు దానం ఇస్తున్న అందరూ వేగు చుక్కలుగా సమాజం లో నిలిచిపోతారన్నారు. కేన్సర్ వ్యాధితో పోరాడి ప్రాణాలు కోల్పోయిన తమ బిడ్డ అనారోగ్య సమయం లో "రక్తం" విలువ తమకు అర్థమైందని ఆయన అన్నారు. తమ ఉద్యోగ విధుల నిర్వహణలో భాగంగా ఎన్నో సార్లు వైద్య శిబిరాలు, రక్త దాన శిబిరాలు నిర్వహించిన సంగతిని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అత్యధిక సార్లు రక్తదానం చేసిన పాత్రికేయులు . శ్రీ సింహాద్రి కృష్ణ ప్రసాద్, నాగాయలంక సాక్షి (43 సార్లు), మురళీకృష్ణ తిరుమాని, మచిలీపట్నం వార్త (71సార్లు). గరిక విజయ కుమార్, విజయవాడ ప్రజాశక్తి(16 సార్లు), .యు. కిరణ్ కుమార్ రెడ్డి గతంలో సాక్షి ,(25 సార్లు),లను చైర్మన్ సన్మానించారు.
అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యాపారస్తులు కె. అరుణ్ కుమార్, గుంటూరు(81 సార్లు),శ్రీ గాజుల రోహిత్, తాడేపల్లి(46 సార్లు) కె.ఏ.వి. సుధీర్, విజయవాడ(61 సార్లు) వ్యవసాయదారులుశ్రీ పరుచూరి చిన బాబు అవనిగడ్డ(55 సార్లు), స్వాయం ఉపాధి రంగం లో శ్రీ వున్నమాచర్ల రామకృష్ణ, గుడివాడ,(53 సార్లు), విజయవాడ రైల్వే సూపరింటెండెంట్ శ్రీ ఎం. రమేష్, విజయ వాడ(45 సార్లు), జిల్లా కోర్టులో పనిచేస్తోన్న బి. వంశీ కాంత రెడ్డి, గుంటూరు(35 సార్లు), లను చైర్మన్ సన్మానించారు.
ఈ కార్యక్రమం లో చైర్మన్ ఓ.ఎస్.డి. శ్రీ ఎస్. శ్రీనివాస జీవన్, ఏ.ఓ. శ్రీ ఎం.ఎస్. ఎన్ మూర్తి, కంటెంట్ ఎడిటర్ శ్రీ కలమండ శరత్ బాబు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.