చిక్కిన చిరుత

6/24/2023 1:53:27 PM

*ఊపిరి పీల్చుకున్న భక్తులు

తిరుమల, జూన్ 24:  తిరుమల నడక దారిలో ఓ బాలుడిపై చిరుత దాడి చేయడంతో అటవీ శాఖ అధికారులు ఆ చిరుత కోసం జల్లెడ పట్టారు. మొత్తానికి చిరుత బోనుకి చిక్కింది. అలిపిరి మార్గంలో బాలుడిపై దాడి చేసిన చిరుతగా అధికారులు అనుమానిస్తున్నారు. చిరుతను అటవీ అధికారులు బంధించారు. దీంతో.. ఈ ఘటన జరిగినప్పటి నుంచి బిక్కుబిక్కుమంటూ నడక దారిలో వెళుతున్న శ్రీవారి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
చిరుతను పట్టుకోవడానికి తిరుమల నడక దారిలో రెండు బోన్లు, 30 కెమెరాలను ఏర్పాటు చేశారు. 2008లో కాలి నడక భక్తులపై చిరుత దాడి చేసినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. తాజా ఘటనలో కూడా బాలుడిపై చిరుత దాడి చేసినా మెడ, ముఖం పైన గాయాలు తప్ప ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అయితే దాడి చేసిన చిరుతను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ ప్రాంతంలో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో తెలుసుకోవడానికి కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.

*అసలేం జరిగిందంటే..*

పోలీస్‌ పోస్టు వెనుక వైపు అడవిలోకి బాలుడిని చిరుత పులి నోట కరుచుకుని ఈడ్చుకుంటూ వెళ్లింది. కాసేపటికి దాదాపు 20 మంది పోగయ్యారు. అందరూ కలిసి మొబైల్‌ టార్చ్‌లు ఆన్‌ చేసుకుని అడవిలోకి బయలుదేరారు. అరుస్తూ, కేకలు పెడుతూ అడవంతా గాలించారు. దాదాపు 25 నిమిషాల తర్వాత 150 మీటర్ల దూరంలో రిపీటర్‌ స్థలం వెనుక లోయలో పిల్లాడి ఏడుపు వినిపించింది. ధైర్యం చేసి కిందికి దిగారు. ముఖమంతా నెత్తురోడుతూ చిన్నారి కౌశిక్‌ రోదిస్తున్నాడు. అమాంతం బిడ్డను జవురుకుని రోడ్డు మీదకి జనం పరుగు తీశారు.

ప్రాణాలతో దక్కిన బిడ్డను గుండెలకు హత్తుకుని అల్లుకుపోయింది తల్లి. ఆ తర్వాత భద్రతా సిబ్బంది సాయంతో ఆసుపత్రికి బాబుని తరలించారు. జనం అరుపులు కేకలు, రాళ్ల దాడితో బెదిరిపోయిన చిరుత పులి పిల్లాడిని వదిలి బతుకుజీవుడా అంటూ పారిపోయింది. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆస్పత్రిలో చిన్నారి కౌశిక్‌ కోలుకుంటున్నాడు.కౌశిక్‌ను శుక్రవారం టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి పరామర్శించారు.

 

Name*
Email*
Comment*