ఏపీ కి పోలీస్ బాస్ ఎవరు❓️

6/24/2023 1:57:55 PM


అమరావతి:జూన్ 24
రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలకమైన అంశాలపై దృష్టి సారిస్తోంది. ముందు ముందు ఎన్నికల ఏడాది కావడంతో శాంతి భద్రతలు అత్యంత ప్రధానంగా మారాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొందని ప్రతిపక్ష, రాజకీయ పార్టీలు విమర్శలు సంధిస్తున్న తరుణంలో పోలీసుశాఖ ను పటిష్టం చేయడంతోపాటు వచ్చే ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ సమర్ధవంతంగా జరగాలి. అందుకు పోలీసుశాఖను పూర్తి స్ధాయిలో సమాయత్తం చేయాల్సి ఉంది. సరిగ్గా ఎన్నికల ముందు పోలీసుశాఖపై ప్రతిపక్షాల ఆరోపణలకు అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఇప్పుడే అంతా సెట్‌రైట్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో డీజీపీ వ్యవహారం తెర మీదకు వచ్చింది. ప్రస్తుతమున్న డీజీపీ కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి ఇన్‌ఛార్జిగా మాత్రమే కొనసాగుతున్నందున ప్రభుత్వానికి డీజీపీ నియామకం అత్యంత కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పుడిదే అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు పోలీసు శాఖలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడున్న కసిరెడ్డినే కొనసాగించేలా కేంద్రం ఆమోదం లభించేలా లాంఛనాలు పూర్తి చేస్తారా? లేక కొత్త డీజీపీ నియామకం చేపడతారా అన్న చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది.


Name*
Email*
Comment*