మంచిర్యాల జిల్లా, జులై 18: ఉయ్యాలే ఉరితాడై ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మంచిర్యాల జిల్లా భీమినీ మండలం బిట్టుర్పల్లి పంచాయతీ పరిధిలోని రాజారం గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దుర్గం గణపతి, సునీత దంపతుల కుమారుడు అక్షిత్(13)కు సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో ఇంటి వద్దే ఉంచి తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు.
ఇంట్లో చీరతో కట్టిన ఉయ్యాలపై ఊగుతూ ఆడుకుంటూ ఉండగా చీర బాలుడి మెడ చుట్టూ గట్టిగా బిగుసుకోవడంతో ఊపిరి ఆడక అల్లాడిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వారు పత్తి చేనులో పనులకు వెళ్లిన తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అనంతరం 108 వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అక్షిత్ మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో వివరాలు సేకరించి మృతదేహాన్ని మంగళవారం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భీమిని ఎస్సై మహేందర్ తెలిపారు. అందరితో కలివిడిగా ఉంటూ ఆడుకునే విద్యార్థి అక్షిత్ మృతి చెందాడనే వార్త తెలియగానే తోటి విద్యార్థులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు.