- స్థానికంగా వ్యవసాయ, అటవీ, మత్స్య పరిశ్రమల ఏర్పాటుతో వలసల నివారణ
- - వ్యవసాయాభివృద్ధితో ఉత్తరాంధ్రకి పూర్వవైభవం
- - విజన్ వెల్లడించిన పల్సస్ గ్రూప్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు
విజయనగరం, ఎక్స్ ప్రెస్ న్యూస్:
సుస్థిర ఆర్థిక కారిడార్ల ఏర్పాటుతో ఉత్తరాంధ్రకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అవసరమైన విజన్ డాక్యుమెంటుని పల్సస్ గ్రూప్ రూపొందించింది. వ్యవసాయ, అటవీ పరిశ్రమలను స్థానికంగా ఏర్పాటు చేయడం ద్వారా వలసల నివారణ సాధ్యమవుతుందని, వ్యవసాయాభివృద్ధితో ఉత్తరాంధ్రకి పూర్వవైభవం తీసుకురావొచ్చని తమ అధ్యయనంలో తేలిందని పల్సస్ గ్రూప్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు వివరించారు. వలసల సంక్షోభం నుంచి సంక్షేమం వైపు పయనించే ఉత్తమ మార్గం ఇదేనని వెల్లడించారు. విజయనగరంలో దాదాపు 5,000 మంది రైతులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి పల్సస్ సీఈవో ప్రసంగించారు.
20కి పైగా గ్లోబల్ సమ్మిట్‌లను నిర్వహించి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సదస్సులకి హాజరైన అనుభవంతో, ఉత్తరాంధ్ర యొక్క అనుకూలతలను శ్రీనుబాబు వివరించారు. స్థానిక ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా ఈ ప్రాంతం యొక్క మొత్తం అభివృద్ధికి చోదకశక్తిగా ఉపయోగపడే వ్యవసాయ-ఆధారిత ఆర్థిక కారిడార్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
గత 20 ఏళ్లలో ఉత్తరాంధ్ర నుండి వలస వచ్చిన 25 లక్షల మందిలో 10 లక్షల మందికి పైగా విజయనగరం జిల్లా నుంచి వలస వెళ్లడం ఆందోళనకర అంశమన్నారు. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేకపోవడం, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలతో సహజ వనరులు, సంప్రదాయ వ్యవసాయం, వృత్తులు, మత్స్యపరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. ఈ ప్రమాదకర పరిస్థితులు అధిగమించడానికి ఉత్తర భారతదేశం అంతటా విస్తరించి ఉన్న పర్యావరణ అనుకూల ఆర్థిక కారిడార్‌ను ఏర్పాటు చేయడమే మార్గం అని సూచించారు. సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం, స్థానికంగా పుష్కలంగా ఉపాధి అవకాశాలను సృష్టించడం వలస నివారణకి మరో పరిష్కారంగా చూపించారు.