మహా మహోపాధ్యాయ సముద్రాల

4/2/2024 10:20:53 AM

వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్: మహా మహోపాధ్యాయ సముద్రాల లక్ష్మణయ్య పేరును ఎప్పుడు తలచినా గొప్ప ఆదరంతో గౌరవపూర్ణంగా వారి సహచర్యాన్ని తలపుకు తెచ్చుకుంటాను.                   1988లో కడప ఆకాశవాణిలో నేను చేరినప్పటి నుండి.. ఆ క్రమంలో 1994 లో తిరుపతికి వచ్చి చేరినప్పటి నుండి వారితో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. వారికీ, ఆచార్య సర్వోత్తమ రావు గారికి  నేను పరోక్ష విద్యార్థి శిష్యుడను. విద్యా సంస్థలతో, తిరుమల తిరుపతి దేవస్థానం తో ప్రత్యక్ష సంబంధం నాకు లేకపోయినప్పటికీ, వారిలోని విద్వత్తు, సమాదరణ, స్నేహశీలత్వం కారణంగా నాకూ ఆయా సంస్థలతో కొంత అనుబంధం ఏర్పడింది. అది కేవలం ఆకాశవాణితో మాత్రమే కాక ఇతరేతర సాహిత్య కార్యక్రమాల వల్ల మా అనుబంధం మరింత గాఢంగా వైవిధ్యవంతంగా సాగింది. సాహిత్య కార్యక్రమాలు సెమినార్లు అష్టావధానాలు భువన విజయం వంటి రూపకాలు వివిధ రచయితల సంఘాలతోనే కాక అరబిందో సొసైటీ మలయాళ స్వామి ఆశ్రమం, తిరుపతి, ఏర్పేడు శుకబ్రహ్మ ఆశ్రమం జె.కె. ఫౌండేషన్, అక్షర బ్రహ్మోత్సవాలే కాకుండా, తెలుగు తల్లి మీద పద్య శతకం ఆడియో సిడిలుగా చిత్తూరు జిల్లా రచయితల సంఘం వారి కోరిక మీద నా సంపాదకత్వంలో తీసుకురావడం, వాటిని పాఠశాల విద్యార్థులకు చేరువ చేయడంలో వారి సహకారం ఎంతో ఉంది.     సాహిత్య కార్యక్రమాలు నిమిత్తం ప్రయాణాలు చేసే సందర్భంలో మరెన్నో సాహిత్య ఆధ్యాత్మిక ధార్మిక సంబంధ విషయాలు మీద ఎంతో సమాచారాన్ని గ్రహించే అవకాశం నాకు దొరికింది. అది నా వృత్తినైపుణ్యానికి మరింత మెరుగులు పెడుతుండేది. ఆస్ఫూర్తితోనే నేను రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో యోగ విజ్ఞానం లోనూ, ఆలయ సంస్కృతిలోనూ పీజీ డిప్లమో కోర్సులు చేయడానికి పరోక్షంగా దారితీసింది. తిరుపతి త్యాగరాయ మండపం కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి శుభప్రదం లాంటి కార్యక్రమాలు, అన్నమాచార్య తదితర ప్రాజెక్టులు- వారి వివిధ రకాల కార్యక్రమాల ఏర్పాటుకు తిరుపతి విద్వజ్జన సమూహానికి ఆయన తోడ్పాటు, నాయకత్వం, పెద్దదిక్కుగా ఉండేది. తిరుపతి కాళహస్తి గూడూరు వంటి పట్టణాలకు వెళ్లి ఆయా కార్యక్రమాలతో పాల్గొని రావడం సాహితీ తీర్థయాత్రలుగా అవి సాగుతుండేవి. సాహిత్య ఆధ్యాత్మిక కార్యక్రమాలతో లో వారు ముందుండి మమ్మల్ని నడిపించేవారు.డాక్టర్ మేడసాని మోహన్, ఆచార్య జి. దామోదర నాయుడు డాక్టర్ మన్నవ భాస్కర నాయుడు.. మొదలైన వారితో ఒక బృందంగా తరలి వెళ్లడం కార్యక్రమాలను జయప్రదంగా ముగించుకొని రావడం ఇప్పటికీ మరుపురాని మధుర జ్ఞాపకాలే!. తెలుగు వారి పండుగలు.. సంక్రాంతి ఉగాది దసరా వినాయక చవితి వంటి పండుగ సందర్భాలు, బ్రహ్మోత్సవాలు సప్తాహాలు సందర్భంగా వారి ప్రసంగాలను వినడం, వారి మార్గదర్శనంలో ప్రసంగాలు చేయడం నా వంటి వారికి గొప్ప ఆధ్యాత్మిక సాహిత్య స్పూర్తిమంతమైన సార్వస్వత యాత్ర. డాక్టర్ సాయి కృష్ణ యాచేంద్ర సంగీత గేయ ధారలో కూడా మేము ఒక బృందంగా, వేర్వేరు ప్రదేశాల్లో పాల్గొంటూ ఉండేవాళ్లం. ఆచార్య లక్ష్మణయ్య గారి వల్ల నాకు వ్యక్తిగతంగా  వృత్తిపరంగా సాఫల్యతను ధన్యతను పొందింది. 
మల్లేశ్వరరావు ఆకుల ఐ.బియస్.(రి). ఆకాశవాణి విశ్రాంత సంచాలకుడు.తిరుపతి

Name*
Email*
Comment*