*ఒక సాయం సంధ్య, స్మృతి వనంలో*!

4/2/2024 10:24:50 AM


స్వరానిది అశరీర అస్తిత్వం. శరీరం నస్వరం. 
స్వరం అనస్వరం. శ్రవణేంద్రియం అమూర్తమత్వాన్ని మూర్తిమంతం చేసి మన ముందు ఉంచుతుంది. 
కళ్ళు మూసుకుంటే కనబడే ఆకృతి కళ్లెదుటే నిలుపుతుంది ఎప్పుడైనా సరే ఆ స్వరం. 
చేతులతో కలచాలనం సాధ్యం. చేతులు 
లేకుండానే ఒక స్పర్శతో మదిని తాక శక్యమే!. 

పడవలో కూర్చున్నట్లు ఆసనంలో కూర్చోగానే 
ఇరుగట్ల వైపు ఉన్న ప్రకృతి శోభలు కళ్ళ ముందు 
ఉంచి ఆచార్యుల జ్ఞాపకాల యాత్ర మొదలయింది. 
ఆ మహా మహోపాధ్యాయిని రచన.. గణేశ స్తుతి అనంతరం అక్షరాలు నాట్య భంగిమలో ప్రత్యక్షం. సౌమనస్క పరివ్రాజకాచార్యుల సౌజన్యంతో 
దశాబ్దుల తరబడి వాగ్దేవి పుత్రుని సాహిత్య, 
వాచన వరివస్య.. గళాలు మారిన ఆ యశఃకాయుని దీక్ష దక్షతలు నిగర్వనిబద్ధతలు పిన్న పెద్దల పట్ల సౌమనస్య సమ్మానాదరణలలో తేడా కనిపించని భిన్నత్వంలో ఏకత్వం చూపే వారి అద్వైత స్ఫూర్తి. జ్ఞాపకాల అలల సవ్వడుల మధ్య 
జాజ్వల్యమానంగా ప్రకాశించి శోభించింది. 

అదిగో అంతలోనే వారి అక్షరబద్ధమైన స్మృతులు ముత్యాల మంజుషగా అందరి చేతుల్లో అందమైన హరివిల్లులా అమరిపోయింది. అంతేనా !? అంటే మరి అతిథి సత్కారం మాటో ?.. ఇదిగో అది ఈలాగున.. అంతకుముందు శ్రవణేంద్రియాన్ని రుచి రంజన చేసిన వాగామృత ధారలు మస్తిష్కాన్ని రంజిల్ల చేస్తే, 
చివరగా వారి కుటుంబ సభ్యులు పరచిన అల్పాహార వ్యంజనాలు కుక్షిలో ప్రవేశించి, అయ్యవారి హస్తం ..
అమ్మ చేతి గోరుముద్దలు తిన్న అనుభూతిని మిగిల్చింది. 

సర్వజన ప్రియకరంగా జీవన యాత్ర ఎలా 
ముగించాలో, నడుచుకోవాలో,అమరం చేసుకోవాలో..
అయ్యవారు బోధించిన పాఠాన్ని పునశ్చర్వణం తాంబూలంగా నెమరువేసుకుంటూ గృహోన్ముఖంగా నడిపింది.
స్వస్తిర్భవతు.శాంతిర్భవతు. 

మల్లేశ్వర రావు ఆకుల

Name*
Email*
Comment*