అమరావతి: ఎక్స్ ప్రెస్ న్యూస్:
రాజకీయ పార్టీలకు ఎన్నికలలో గెలుపోటములు సహజమని ఓడిపోయిన పార్టీలు పలుకుతుంటాయి. అది నిజమే కావచ్చు. కానీ ఓడిపోయిన తర్వాత అధికార పార్టీ ఒత్తిళ్ళు తట్టుకుంటూ ఐదేళ్ల వరకు పార్టీని కాపాడుకోవడం ఓ ఎత్తు అయితే, ఐదేళ్ల ప్రతిపక్షంలో బలహీనపడిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీని ఎదుర్కొని ఓడించడం మరో ఎత్తు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో టిడిపి బలంగానే ఉన్నప్పటికీ కేసీఆర్ దానిని నిర్వీర్యం చేసేశారు. కానీ టిడిపి ఓటు బ్యాంకుని మాత్రం కేసీఆర్ ఏమీ చేయలేకపోయారు.
అందుకే ప్రతీ ఎన్నికలలో ఎన్టీఆర్ని పొగుడుతూ ఓట్లు రాల్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే 2023 శాసనసభ ఎన్నికలకు ముందు ఖమ్మంలో శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టించారు కూడా. ఆ ఎన్నికలలో టిడిపి పోటీ చేసి ఉండి ఉంటే గెలిచే అవకాశం లేదనే చెప్పవచ్చు. కానీ ఆ ఎన్నికలలో టిడిపి పోటీ చేయకుండా ఉండిపోయి కాంగ్రెస్ పార్టీకి సాయపడింది. ఓ రాజకీయ పార్టీ ఎన్నికలలో పోటీ చేయకుండా మరో పార్టీని గెలిపించడం, చేతికి మట్టి అంటించుకోకుండా కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం రెండూ విశేషమే కదా? 2014 ఎన్నికలలో ఏపీలో వైసీపి ఓడిపోయినప్పుడు, చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యానికి కట్టుబడి దానిని ఇబ్బంది పెట్టలేదు కనుకనే జగన్ పాదయాత్ర చేసుకోగలిగారు.
2019 నాటికల్లా సర్వశక్తులు కూడగట్టుకొని అధికారంలోకి రాగలిగారు. ఆనాడు చంద్రబాబు నాయుడు వైసీపిని అంతగా ఉపేక్షించడం వలననే అధికారం కోల్పోయారనే వాదనలు నేటికీ వినిపిస్తూనే ఉంటాయి. కానీ 2019లో ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రతిపక్షాలు అంటూ మొహమాటాలకు పోకుండా టిడిపిని ఉక్కుపాదంతో అణచివేస్తూ నిర్వీర్యం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో వైసీపి ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు జగన్ గట్టి ప్రయత్నాలు చేశారు. జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండి ఉంటే టిడిపి మనుగడ సాగించడం పెద్ద వింతేమీ కాబోదు.
కానీ 5 ఏళ్ళపాటు ఏకధాటిగా దెబ్బ మీద దెబ్బ తీస్తున్నా పార్టీ చెల్లా చెదురు కాకుండా కాపాడుకోవడం చాలా కష్టం. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కనబరిచిన పోరాటస్పూర్తి కారణంగానే టిడిపి బలంగా నిలబడుతూ జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కోగలిగింది. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న సొరవ ను టిడిపి శ్రేణులు అభినందించవలసిందే జగన్ తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు విధానాలు కూడా టిడిపికి బాగా కలిసివచ్చాయని చెప్పవచ్చు. వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు తెలివిగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగి ఎన్నికలలో వైసీపిని మట్టి కరిపించి మళ్ళీ అధికారంలోకి వచ్చారు.
ఈ 5 ఏళ్ళ చేదు అనుభవాలను చూసిన చంద్రబాబు నాయుడు ఈసారి వైసీపి పట్ల మెతకగా ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఉందామనుకున్నా నారా లోకేష్, టిడిపి నేతలు ఉండనీయరు. కనుక ఇప్పుడు వైసీపి చెల్లాచెదురు అయిపోకుండా జగన్ 5 ఏళ్ళు కాపాడుకోగలరా? అసలు తనను తాను కాపాడుకోగలరా? అంటే అనుమానమే. కానీ ప్రజల తరపున పోరాడుతామని, మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ అప్పుడే ‘కొత్త ప్రగల్భాలు’ పలుకుతున్నారు. ఇంతకాలం వైనాట్ 175? అంటూ పార్టీలో అందరినీ మభ్యపెట్టగలిగారు.
కానీ ఇప్పుడు చిలుక పలుకులతో ఎవరినీ మభ్యపెట్టలేరు. అసలు జగన్తో ఉంటే తమకూ ఇబ్బందులు తప్పవనుకునేవారు వైసీపిలో చాలామందే ఉన్నారు. గతంలో పరిస్థితి వేరు కానీ ఈసారి పరిస్థితి వేరేగా ఉండబోతోంది. ఇటువంటి పరిస్థితులను జగన్ స్వయంగా కల్పించుకున్నారు. కనుక పర్యవసనాలకు ‘సిద్దం’గా ఉండాల్సిందే.