పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లకు శాఖలు ఖరారు

6/10/2024 5:12:25 PM

టార్గెట్ ఫిక్స్..!! 
అమరావతి : ఎక్స్ ప్రెస్ న్యూస్ :
భారీ అంచనాల మధ్య ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. చంద్రబాబు మంత్రివర్గంలో జనసేన, బీజేపీ భాగస్వాములు కానున్నాయి. కొద్ది రోజులుగా పవన్ ప్రభుత్వంలో చేరుతారా లేదా అనే ఒక సందిగ్ధత కొనసాగింది. దీని పైన పవన్ క్లారిటీ ఇచ్చారు. అటు లోకేష్ సైతం మంత్రివర్గంలో చేరనున్నారు. కొత్త ప్రభుత్వంలో ఇద్దరి పాత్ర పైన స్పష్టత వచ్చింది. ఎన్నికల హామీల అమలు..మూడు పార్టీల సమన్వయం ఈ ఇద్దరికి కీలకంగా మారనుంది. ఇద్దరి శాఖలు ఖరారయ్యాయి.

చంద్రబాబు కసరత్తు:
ఏపీలో ఈ సారి పాలన - మిత్రపక్షాలతో సమన్వయం చంద్రబాబు సమర్ధతకు పరీక్షగా మారుతోంది. జనసేన, బీజేపీ నుంచి మంత్రుల సంఖ్యాశాఖల పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. పవన్, బీజేపీ ముఖ్య నేతలతో చర్చించారు. 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు, పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ నుంచి 135 గెలవటం, అలానే  గెలిచిన వారిలో సీనియర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం తో మంత్రుల ఎంపిక పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సామాజిక -ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

మూడు పార్టీలకు పదవులు:
ఇక..జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండటంతో మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే అంశం పైన పవన్ కొద్ది రోజులుగా డైలమాలో ఉన్నారు. అయితే, ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. తాజాగా, ఒక జాతీయ మీడియాతో పవన్ ఈ విషయాన్ని స్పష్టం చేసారు. ఇదే అంశం పైన చంద్రబాబు - పవన్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. జనసేన నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి.. ఏ శాఖలు ఇవ్వాలనే దాని పైన ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.

పవన్ -లోకేష్ శాఖలు:
దీంతో..పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరటం ఖాయమైంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు హోం - గ్రామీణాభివృద్ధి శాఖలు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవటంతో ఏపీలో జనసేనకు 4-5 శాఖలు కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. ఇక..నారా లోకేశ్ కు ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, ఈ సారి రాజధాని - యువతకు ఉపాధి కల్పన కీలకం కావటంతో ఈ శాఖలు కేటాయిస్తున్నట్లు కనిపిస్తోంది. అమరావతి నిర్మాణం సైతం పట్టణాభివృద్ధి పరిధిలోకి రానుంది. రాజధాని కోసం ప్రత్యేక సమయం కేటాయించాల్సి ఉండటంతో..లోకేష్ వద్దే ఉంచుతారా లేక, గతంలో పర్యవేక్షించిన నారాయణకు తిరిగి అప్పగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Name*
Email*
Comment*