(నేడు వెంకట సుబ్బారావు జయంతి)
శ్రీకాకుళం: ఎక్స్ ప్రెస్ న్యూస్ :
"జనగణమణ" రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్, వందేమాతరం రచించింది బంకించంద్ర చటర్జీ అని ఏవరిని అడిగినా చెప్తారు. కాని... "భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు....” అంటూ ప్రతీ భారతీయుడు చేసే ప్రతిజ్ఞ, ఏవరు రాశారంటే అధికశాతం మంది నుంచి సమాధానం దొరకదు. ఈ ప్రతిజ్ఞ రూపకర్త తెలుగు వారైన పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఆరు దశాబ్దాలు దాటినా వన్నె తరగక భారతావనంతా మరింతగా మ్రోగుతూనే ఉంది ఈ ప్రతిజ్ఞ. పదాలు కొన్నే అయినా భరతమాత బిడ్డలందరిని ఐక్యం చేసింది. చేస్తూనే వుంది. కుల, మత, ప్రాంత, లింగ వయో బేధం లేకుండా అందరి నోట అది పలుకుతూ జాతి గౌరవాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. అదేప్రతి పాఠశాలలోనూ ఉదయాన్నే, భవిత దివ్వెలు అయిన మన చిన్నారులు పలికే “ప్రతిజ్ఞ".
"భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు....” అంటూ ప్రతీ భారతీయుడు చేసే ఈ ప్రతిజ్ఞ భారతజాతి ఐకమత్యానికి ప్రతీకగా ఉంటూ భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. విద్యాబుద్ధులతో పాటు దేశపౌరునిగా మలుచుకోవలసిన బాధ్యత, విజ్ఞతను ఈ ప్రతిజ్ఞ మన చిన్నారులకు తెలియజేస్తుంది. అంతే కాకుండా భారతీయులందరూ సహెూదరులు, భరతజాతి ఔన్నత్యం పెంపునకు వీరంతా మూలస్థంబాలని ఈ ప్రతిజ్ఞ చాటి చెబుతుంది. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలను గౌరవించి చాటివారు, జంతుజాలం పట్ల సేవా నిరతితో ఉండాలని ఇది చెబుతుంది.
విశాఖలోనే ఈ రచన :
అంతటి విశిష్టత కలిగి, దేశమాతకు నిత్యం నివాళిలు అర్పించేందుకు బాసటగా నిలుస్తున్న ఈ ప్రతిజ్ఞ పుట్టింది ఆంధ్రదేశాన అందునా సాహితీ సౌరభాలకు, చైతన్యానికి కాణాచి అయిన విశాఖపట్నంలోనే కావడం ప్రతీ తెలుగువారికి ఎంతో గర్వకారణం. విశాఖ వాకిట ఉద్భవించిన ఈ ప్రతిజ్ఞ నేడు భారతావని కంతటికి ఒక స్ఫూర్తిదాయకమైన నినాదనంగాను, ఆచరణీయమైన విధానంగా మారింది. జాతీయగీతము అయిన 'జనగణమన' తో సమానమైన గౌరవం, విశిష్టతను సంపాదించుకొని నేడు విద్యాగ్రంథాల్లో వర్థిల్లుచున్నది. ఇంతటి ఖ్యాతిగాంచిన ఈ ప్రతిజ్ఞ రూపకర్త పైడిమర్రి వెంకట సుబ్బారావు విశాఖ జిల్లాకు ప్రభుత్వ కోశాధికారి (ట్రెజరర్ గా ఉన్నప్పుడు 1962 సెప్టెంబర్ 17న సుబ్బారావు దీన్ని రచించారు. 1962 చైనా-భారత్ మధ్య యుద్ధం జరిగిన సందర్భంగా దీని ఆవశ్యకతను వివరిస్తూ విద్యాశాఖాధికారులకు, నాటి ప్రజాప్రతినిధులకు, సామాజిక స్పృహగల వ్యక్తులకు లేఖలు రాశారు. అందుకు స్పందిస్తూ నాటి, రాష్ట్ర విద్యాశాఖామాత్యులు పి.వి.జి.రాజు, స్వాతంత్ర్య సమరయోధులు, అప్పటి విశాఖ లోక్ సభ సభ్యులు తెన్నేటి విశ్వనాథంలు సుబ్బారావును అభినందిస్తూ అతని రచన అయిన “ప్రతిజ్ఞ”ను మొదటిగా విశాఖ జిల్లాలోని పాఠశాలల్లో 1963లో ప్రవేశపెట్టేందుకు కృషి చేశారు. తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వం, మానవ వనరుల శాఖ, కేంద్ర విద్యా సలహామండలి దృష్టికి తీసుకువెళ్లారు. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర విద్యా సలహామండలి 1964లో బెంగుళూరులో జరిగిన ప్రత్యేక సమావేశాలలో నిర్ణయించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1965 జనవరి 26 గణతంత్ర దినోత్సవం నుంచి ఇది దేశవ్యాప్త ప్రతిజ్ఞగా మారింది. అన్ని ప్రాథమిక, మాధ్యమిక తరగతులకు చెందిన ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతీ విద్యార్థి చదివేలా, ఆచరించేలా "ప్రతిజ్ఞ” పాటించుట సంప్రదాయంగా మారింది. అంతే కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అకాడమీలు ప్రచురించే ఒకటి నుంచి పదో తరగతి వరకూ గల పాఠ్యపుస్తకాల్లో జాతీయగీతముతో పాటు ప్రతిజ్ఞను కూడా ప్రచురిస్తున్నారు. తెలుగు భాషలో రూపుదిద్దుకున్న ఈ ప్రతిజ్ఞను బహుళప్రయోజనార్థం ఆంగ్లం, హిందీ, సంస్కృతం తదితర ఏడు భాషల్లోకి కూడా అనువదించచి దీనికి మరింత ప్రాచుర్యం, విశిష్టత కల్పించారు. అంతటి స్ఫూర్తిదాయకమైన ఈ ప్రతిజ్ఞ విద్యార్థులు, పాఠశాలలు తు.చ. తప్పక ఆచరించి నట్లయితే భారతజాతి ఔన్నత్యం పెరగడమే కాకుండా నేటితరం మధ్య సోదరభావం, విభిన్నజాతులు, ప్రాంతాల మధ్య స్నేహభావం మరింతగా ఇనుమడిస్తుందని చెప్పవచ్చు. అదే విధంగా ప్రపంచీకరణ, పట్టణీకరణ, సాంకేతీకరణ ప్రభావానికి లోనవుతున్న నేటి చిన్నారులు, విద్యార్థుల్లో దేశభక్తి, సేవానిరతి, గౌరవభావం, బాధ్యత కొరవడకుండా ఉంటుంది. అందుకే అన్నివర్గాలు ప్రతిజ్ఞను అనుసరిద్దాం. భావితరాలకు ఆదర్శనీయంగా నిలుద్దాం.
ఇదీ వెంకట సుబ్బారావు ప్రొఫైల్:
"ప్రతిజ్ఞ" రచయిత పైడి మర్రి వెంకట సుబ్బారావు వెంకటరామయ్య, రాంబాయమ్మ దంపతులకు నేటి తెలంగాణకు చెందిన నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో 1916 జూన్ 10న జన్మించారు. జిల్లా కోశాధికారిగా కెరీర్ ను ప్రారంభించి పలు ప్రాంతాలతో పాటు విశాఖలోనూ పనిచేశారు.
విశాఖలో ఉన్న సమయంలోనే జాతీయ ప్రతిజ్ఞ రచన చేశారు. 1971 మే లో నల్గొండలో డి.టి.ఒ.గా పదవీ విరమణ చేసిన వెంకట సుబ్బారావు తన జీవితంలో అధిక భాగం సాహిత్య సేవకు, భాషా ఉద్దరణకు, జనజాగృతికి అంకితమయ్యారు. 1936లో "మీ మాంసాత్రయం, 1938లో గీతా మీమాంస, దైవభక్తి వంటి గ్రంథాలు వెలువరించారు.
సింగపురీన్న కేసరీ శతకం, బాలరామాయణం, శ్రీ వెంకటేశ్వరస్తుతి, తారావళి వంటి రచనాగ్రంథాలు ఈయన కలం నుండి వెలువడ్డాయి. తెలుగ సాహితీవనాన ప్రఖ్యాతగాంచిన “కాలభైరవుడు" నవల వెంకట సుబ్బారావు రచనే. ఈయన పలు అనువాదాలు కూడా చేశారు. అరబ్బీ భాష నుంచి "జీవిత మహాపథము" అనే గ్రంథం తెలుగులోకి అనువదించారు. “నౌతి-ధౌతి" అనే ప్రకృతి వైద్య సంబంధిత పుస్తకాన్ని కూడా రచించారు. అంతే కాకుండా ప్రకృతి వైద్యంను, హెూమియో వైద్యం కూడా చేస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం పాటుపడ్డారు. 1988 ఆగస్టు 13వ తేదీన తుదిశ్వాస విడిచారు.
మనమూ చేద్దాం మన ప్రతిజ్ఞ:
"భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని, జంతువులపట్ల దయతో మెలిగెదనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.
---డా. జి. లీలా వరప్రసాదరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, జర్నలిజం విభాగం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం.