ఏపి లిక్కర్ పాలసీలో భారీ కుట్ర

6/10/2024 7:21:40 PM

- వాసుదేవ రెడ్డి తో పాటు పలువురికి బిగుసుకుంటున్న ఉచ్చు
-గత ప్రభుత్వ హయాంలో 20వేల కోట్ల భారీ స్కాం..!
-అబ్కారీ శాఖలో చిట్టాను వెలికితీస్తున్న నూతన ప్రభుత్వం..? 
-ఆంధ్ర నుండి ఢిల్లీ.. పాకిన లిక్కర్ స్కాం 

అమరావతి: ఎక్స్ ప్రెస్ న్యూస్:   
2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం నిషేధం అంటూ ప్రకటించిన వైసిపి అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో నూతన మద్యం పాలసీతో ఎప్పుడు కనివిని ఎరగని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టింది, అయితే ఈ మద్యం పాలసీలో భారీగా అవినీతి చోటు చేసుకుందని తాజాగా అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం విచారణ చేపట్టనుంది.
గత ప్రభుత్వ పాలసీ వివరాల్లోకెళ్తే గతంలో బేవరేజెస్ కార్పొరేషన్ కి, రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ గా విడివిడిగా ఐఏఎస్ అధికారులు ఉండేవారు, ఎక్సైజ్ కార్పొరేషన్ కమిషనర్ మద్యం పాలసీను,ధరలను,నిబంధనలను నిర్ణయిస్తే..బేవరేజస్ కార్పొరేషన్ ఎండి లిక్కర్ కంపెనీల నుండి మద్యం సరఫరా చేస్తూ విధులు నిర్వహించేవారు,అందుకు భిన్నంగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు విభాగాలకు కలిపి వాసుదేవరెడ్డిని(ఒకరినే) నియమించింది.
అక్కడ నుండి పక్కా ప్లాన్ ప్రకారం. 2019లో స్టాండర్డ్ బ్రాండ్ లిక్కర్ కంపెనీలకు ఇవ్వవలసిన బకాయిలను కావాలనే ఆపివేసి... నూతన మద్యం పాలసీ అంటూ.. కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చి లిక్కర్ కంపెనీ సప్లయర్లకు గతంలో చెల్లించే ధర కన్నా  అధికంగా మూడు రెట్ల ధరను పెంచి.. ప్రభుత్వనికి అయినవారికి, అనుకూల వ్యక్తులకు, పార్టీలోని బడా నాయకుల లిక్కర్ కంపెనీలకు (టెండర్లలో చట్టలోసుగులను ఉపయోగించి) ఎప్పుడూ చూడని, వినని పిచ్చి పిచ్చి బ్రాండ్ కంపెనీలకు లిక్కర్ లేబుల్స్ అప్పచెప్పారు, అందుకు గాను కోట్ల రూపాయల భారీ ప్రతిఫలం నాటి ప్రభుత్వ పాలకులకు,పెద్దలకు,అధికారుల జేబులకు చేరాయి అనేది ప్రస్తుత ప్రభుత్వ ఆరోపణ.
ఉదాహరణకు ఒక బాటిల్ ధర 20 రూపాయలు సప్లయర్ నుంచి కొనుగోలు చేస్తే దానికి .. వైన్ దుకాణాల అద్దెలు, నిర్వహణ వ్యయం పది రూపాయలు కలిపి 30 రూపాయలు.. మరియు దీనికి మరో వంద రూపాయలు అదనంగా చేర్చి ఒక బాటిల్ ధర 130 రూపాయలు అమ్మకాలు జరిపారు అనుకొంటే... అందనంగా ఉన్న వంద రూపాయలను ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, అడిషనల్ వ్యాట్ కింద రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుగా జమ చేసేవారు, అలా రోజుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు60 నుండి 70 కోట్లకు పైగా అమ్మకాలు జరిగేవి.
ఈ విధంగా వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీని చూపించి బ్యాంకుల్లో తనాఖ పెట్టీ సుమారు 25 వేల కోట్లు అప్పుగా తీసుకున్నారు, తిరిగి బ్యాంకుకు రోజువారీగా 60 కోట్లు ఆన్లైన్లో చెల్లించేలా ఒప్పందం...ఈ ఒప్పందాన్ని బురిడీ కొట్టించి నగదు రూపంలో మాత్రమే అమ్మకాలు జరిగేలా చేసి  వారానికి సుమారు 420 కోట్ల రూపాయలు బ్యాంకులో నగదు రూపంలో చెల్లించేలా చర్యలు తీసుకున్నారు,కథంతా ఇక్కడే మలుపు తిప్పారు 
వారంలో మొదటి ఐదు రోజులలో (శుక్రవారం వరకు) వచ్చిన డబ్బులు ప్రతి సోమవారం బ్యాంకులో జమ చేసి...శని ఆదివారాలలో కొన్ని అనధికారిక అమ్మకాలు ద్వారా అదనంగా వచ్చిన డబ్బులు (సుమారు 60-70కోట్లు) పక్కదారి పట్టించారు అనేది వెలుగులోకి వస్తున్న సంచలన విషయం.
ఈ  ఉదాంతం పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి వైన్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు జరిపి లెక్క పత్రాలు లేకుండా అనధికారిక అమ్మకాలు జరుగుతున్నాయని రుజువు చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు, ఇలా అదనంగా వచ్చిన డబ్బును ప్రభుత్వ పెద్దలకు చేర వేసేందుకు వీలుగా.. అక్రమ వ్యవహారాలన్నీ చక్కపెట్టేందుకు మ్యాన్ పవర్ ఏజెన్సీలను తమ వారికే కట్టబెట్టి వ్యవహారాలన్నీ చక్కదిద్దారు, అలా ఈ నాలుగున్నర సంవత్సరాలలో సుమారు 20 వేల కోట్ల రూపాయల భారీ స్కామ్ జరిగిందనే విషయాన్ని టిడిపి ప్రభుత్వం వెలికితీస్తున్నట్లు సమాచారం.
ఇంత పెద్ద భారీ స్కాం కు అనుకూలంగా వ్యవహరించిన ఏజెన్సీ వ్యవహారకులతో పాటు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు ఎవరెవరున్నారు ఉన్నారు అనేది వెలికి తీయడంలో రాష్ట్ర సిఐడి  విచారణ సరిపోదని, కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకున్న ఈ అబ్కారి స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) జోక్యం చేసుకుంటే చిన్న చేపల నుండి పెద్ద పెద్ద తిమింగలాల వరకు ఎవరెవరు ఉన్నారు, అనే విషయం బయట పడుతుందని సెక్రటేరియట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 
కాగా ఇటీవల కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపిన లిక్కర్ స్కాం ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీకి పాకిన తతంగం అనేది అందరికీ తెలిసిన విషయమే..ఆంధ్రా లిక్కర్ స్కాం సముద్రమంతా.. ఢిల్లీలోది ఇసుకరేణువు అంత చిన్నది కావడంతో.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ కు ఫిర్యాదుతో..ఢిల్లీలో అసలు విషయం బట్టబయలు అయింది.

Name*
Email*
Comment*