రామోజీరావు నిలువెత్తు విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు.. కలిశెట్టి

6/15/2024 4:35:18 PM

గన్నవరం - ఎక్స్ ప్రెస్ న్యూస్ 
 భావితరాలకు గుర్తుండిపోయేలా.. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. శుక్రవారం కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉన్న శిల్పి వద్దకు వెళ్లి, రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించేందుకు సన్నద్ధం చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ తొలినాళ్లలో ఉత్తరాంధ్రలో తెలుగు పత్రిక ఈనాడును ప్రస్థానం చేయించిన ఘనత రామోజీరావు కి దక్కుతుందని పేర్కొన్నారు.
 తొలినాళ్లలోనే  విశాఖ తీరంలో ఈనాడు పత్రికను స్థాపించి.. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని రామోజీరావు చైతన్యపరిచారని అన్నారు. ప్రజా సమస్యలను ఈనాడు పత్రికలో వార్తల రూపంలో ప్రచురించి, ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి,  వాటిని పరిష్కరించే దిశగా వారధి వలె రామోజీరావు పనిచేశారని తెలిపారు. ఉత్తరాంధ్రలో పత్రిక ముద్రణ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, తొలినాళ్లలో ఇక్కడి నుంచే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఈనాడు పత్రికను పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు. దానికి కృతజ్ఞతగా ప్రస్తుతం ఉత్తరాంధ్రలో రామోజీరావు యొక్క నిలువెత్తు విగ్రహాన్ని తొలుతగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని స్పష్టం చేశారు. తెలుగువారి కోసం, తెలుగుతనాన్ని, తెలుగు పౌరుషాన్ని, తెలుగు జాతిని కాపాడే దిశగా రామోజీరావు పత్రికలు, టీవీలు, ఫిలిం సిటీ, మార్గదర్శి సంస్థల ఏర్పాటుతోపాటు ఎంతోమంది కళాకారులని తీర్చిదిద్దిన సందర్భం.. తదితర రామోజీరావు గురించిన  అంశాలు  భావితరాలకు తెలియాలంటే రామోజీరావు ప్రతిబింబాన్ని బాహ్య ప్రపంచానికి కనిపించే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ రోజున ఈ క్రమశిక్షణ, బాధ్యతలు, ఈ సొసైటీ పై ఉన్న నమ్మకం, మంచి సుగుణాలు.. ఈనాడులో పనిచేయడం వల్లనే తనకు అబ్బాయని అప్పలనాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతంలో రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ట చాలన్న విషయాన్ని త్వరలో నిర్ణయిస్తామని, రెండో విగ్రహాన్ని రణస్థలంలోని సాయి డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రతిష్టించనున్నట్టు వివరించారు.

Name*
Email*
Comment*