రాష్ట్రంలోని ఆలయాల పూర్వవైభవానికి కృషి

6/18/2024 11:46:06 PM

- దేవాలయ భూములు, ఆస్తుల పరిరక్షణకు చట్టప్రకారం చర్యలు
- అన్యాక్రాంతమైన భూముల వివరాలు సేకరిస్తాం
- దేవాదాయశాఖ ప్రక్షాళనతో హిందూధర్మ పరిరక్షణకు పెద్దపీట
- రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

నెల్లూరు: ఎక్స్ ప్రెస్ న్యూస్:  జూన్‌ 18 : 
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి ఆలయాల పూర్వవైభవానికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు సంతపేటలోని మంత్రి నివాసంలో ఆయన తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక శతాబ్ధాల చరిత్ర గల ఆలయాలు ఎన్నో ఉన్నాయని, వీటి అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో మాట్లాడి చర్యలు చేపడ్తామన్నారు. ప్రధాన ఆలయాలను మరింత పటిష్టం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దేవాదాయశాఖలో ప్రక్షాళన చేపట్టి సమూల మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి చెప్పారు. అనేక ఆలయాలకు ఎన్నో వందల ఎకరాల్లో భూములు, ఆస్తులు వున్నా ఆలయాలు అభివృద్ధికి నోచుకోకుండా వుండిపోయాయని, ఇలాంటి ఆలయాలను గుర్తించి దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు చట్టప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. అనేక దేవాలయాల భూములు, ఆస్తులను ఇతరులు అన్యాక్రాంతం చేసి కబ్జాలకు పాల్పడి వున్నారని, వీటిని గుర్తించి అధికారులతో సమీక్షించి చట్టప్రకారం ముందుకెళ్తామన్నారు.  భవిష్యత్‌లో ఆలయాలను అభివృద్ధిచేసి ఆధ్యాత్మిక భావనను పెంపొందించి హిందూ ధర్మ పరిరక్షణకు కృషిచేయడమే ప్రధానలక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. 

Name*
Email*
Comment*