- కక్ష సాధింపు చర్యలు మానుకో
- చంద్రబాబుకు జగన్ హెచ్చరిక
- జైలులో పిన్నెల్లిని కలిసిన జగన్
నెల్లూరు, ఎక్స్‌ప్రెస్ న్యూస్;
వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అలాగే వారి వ్యక్తిగత, పార్టీ ఆస్తులపై అధికార పార్టీ యథేచ్ఛగా దాడులు చేయడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును ఘాటుగా హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కులమతాలు, రాజకీయాలు చూడకుండా లబ్ధి కలిగించామన్నారు. టీడీపీకి, చంద్రబాబుకు ఓటు వేయలేదనే ఏకైక కారణంతో వైసీపీ కార్యకర్తలు, నాయకుల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాజశేఖరరెడ్డి విగ్రహాల్ని పగులగొడుతున్నారని ఆయన ఆవేదన చెందారు. ఇవన్నీ శిశుపాలుడి పాపాల మాదిరిగా పండే ఒక రోజు వస్తుందని జగన్ హెచ్చరించారు.
మంచి పనులతో ముందుకు వెళ్లండి...
ప్రజాస్వామ్యంలో ఏదైనా మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలన్నారు. తాము మంచి చేశామని ప్రజల్ని ఓట్లు అడిగేలా వుండాలన్నారు. భయంతో రాజకీయాలు చేయాలని అనుకుంటే అలాంటివి నిలబడవన్నారు. దాడులు, దౌర్జన్యాల్ని ప్రజలు లెక్క కట్టి చంద్రబాబుకు బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. చంద్రబాబులో మార్పు రావాలని ఆయన కోరారు. ప్రజలకు మంచి చేసి వైసీపీ ఓడిపోయిందన్నారు. చంద్రబాబు చేసిన మోసపూరిత హామీల వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. చంద్రబాబు రైతు భరోసా కింద రూ.20 వేలు ఇస్తామన్నారని గుర్తు చేశారు. ఖరీఫ్ మొదలైనా ఇంత వరకూ రైతు భరోసాకు అతీగతీ లేదన్నారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా బడిఈడు పిల్లలున్నారని, ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ డబ్బు ఏమైందని తల్లులు అడుతున్నారని జగన్ అన్నారు. పరిపాలనపై దృష్టి పెట్టి హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడు కాబట్టే వరుసగా నాలుగుసార్లు గెలుస్తూ వచ్చాడన్నారు. అలాంటి నాయకుడిని తీసుకొచ్చి తప్పుడు కేసుల్లో జైల్లో పెట్టడం ఎంత వరకు ధర్మం అని జగన్ ప్రశ్నించారు. ఒక్క రామకృష్ణారెడ్డి మాత్రమే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఇదే రకంగా వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ మొదలుకుని, గ్రామస్థాయి వరకూ రెడ్‌బుక్‌లు పెట్టుకుని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యేలే గూండాగిరీ...
ఏకంగా ఎమ్మెల్యేలే పొక్లయిన్లపై వెళ్లి బిల్డింగ్‌లు పడగొడుతున్నారని జగన్ విమర్శించారు. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు అని చంద్రబాబు సర్కార్‌ను జగన్ హెచ్చరించారు. చంద్రబాబూ.. ఎల్లకాలం మీ రోజులే వుండవని, గుర్తు పెట్టుకోవాలని జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీ పాపాలు వేగంగా పండుతున్నాయన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు క్షమించని పరిస్థితికి వస్తారన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులుంటాయని ఆయన హెచ్చరించారు.
చేతనైతే మంచి చేసి ప్రజల మనసుల్ని గెలుచుకోవాలని హితవు పలికారు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతున్న సీఎం అవుతావని చంద్రబాబును హెచ్చరించడం గమనార్హం. నువ్వు వేసే ఈ బీజం రేపు చెట్టు అవుతుందని, ఏదైతే విత్తుతున్నావో అదే పండుతుందని హెచ్చరించారు. రేప్పొద్దున మీకు ఇదే రకంగా జరుగుతుందని ఘాటు హెచ్చరిక చేశారు. అలాంటి తప్పుడు సంప్రదాయాన్ని ఇప్పటికైనా ఆపాలని హెచ్చరిస్తున్నామని.. ఇదే మాదిరిగా జరిగితే ఊరుకునేది లేదన్నారు.