త‌ల్లికి వంద‌నంపై స‌ర్కారు త‌డ‌బాటు

7/12/2024 10:02:14 PM

- ఆ జీవో ఫైన‌ల్ కాదంటూ విద్యాశాఖ వివ‌ర‌ణ 
- పాత జీఓలో ఉన్న‌వే ఇప్పుడూ వ‌ర్తిస్తాయ‌ని ప్ర‌క‌ట‌న 

విశాఖ‌ప‌ట్నం, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌; 
ఇటు విప‌క్షాలు ... అటు నెటిజ‌న్లు త‌ల్లికి వంద‌నం జీవోపై సెటైర్లు వేస్తుండ‌డంతో ఎట్ట‌కేల‌కు చంద్ర‌బాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ... ప‌థ‌కం అమలు పై స్పష్టత ఇచ్చింది. పథకం అమల్లో భాగంగా తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో పేర్కొన్న అంశాల పైన విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికల ప్రచారంలో ఒక్క తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం అమలు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. జీఓలో అందుకు భిన్నంగా ఉంది. విమర్శలు రావటంతో...ప్రభుత్వం ఇప్పుడు దీని పైన పూర్తి క్లారిటీ ఇస్తూ ప్రకటన జారీ చేసింది. 

ప్రభుత్వం తాజా ప్రకటన 
ఏపీ ప్రభుత్వం తాజాగా తల్లికి వందనం పేరుతో బడులకు వెళ్లే విద్యార్దుల తల్లులకు రూ 15 వేలు చొప్పున ఇచ్చేలా ప్రకటించిన హామీ పైన తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో కొన్ని సందేహాలు చర్చగా మారుతున్నాయి. రాజకీయంగానూ విమర్శలకు కారణమయ్యాయి. దీంతో, ప్రభుత్వం దీని పైన స్పష్టత ఇచ్చింది. 'తల్లికి వందనం' పథకం మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ పథకం కింద రూ.15వేలు రావాలంటే ఇవే మార్గదర్శకాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. పథకం విధివిధానాలు ప్రభుత్వం రూపొందించిన తర్వాత విడుదల చేస్తామని, అప్పటివరకూ ఎలాంటి అవాస్తవాలు నమ్మవద్దని సూచించింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అమ్మఒడి పేరుతో బడులకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. అయితే, టీడీపీ హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ లో తాము ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని చెప్పుకొచ్చింది. చంద్రబాబు, పవన్ సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేసారు. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ 29 విడుదల చేసింది. ఎన్నికల హామీని విస్మరించేలా ప్రభుత్వ జీవో ఉందంటూ విమర్శలు మొదలయ్యాయి. దీంతో, విద్యాశాఖ తాజాగా స్పష్టత ఇస్తూ మార్గదర్శకాలు ఖరారు కాలేదని చెప్పుకొచ్చింది. దీని ద్వారా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకే అమలు చేస్తారా..లేక, ఏ విధంగా ఈ పథకం అమల్లో ముందుకు వెళ్తారనే విధి విధానాల ఖరారు ద్వారా స్పష్టత రానుంది.

Name*
Email*
Comment*