- ఐపీఎస్‌లతో సహా
- అప్పటి ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఫిర్యాదుతో కదలిక
విశాఖపట్నం, ఎక్స్‌ప్రెస్ న్యూస్;
మాజీ సీఎం జగన్‌తో పాటు సీనియర్ పోలీసు అధికారి పై కేసు నమోదు అయింది. గతంలో సీఐడీ డీజీగా పని చేసిన సునీల్ కుమార్ పైన రఘురామ రాజు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసారు. రఘురామ రాజు వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో నాడు సీఐడీ కేసు నమోదు అయింది. ఆ సమయంలో సీఐడీ అధికారులు తనను కొట్టటంతో పాటుగా హత్యాయత్నంకు పాల్పడ్డారంటూ రఘురామ ఫిర్యాదు చేసారు. ఇదంతా నాటి సీఎంగా ఉన్న జగన్ చేయించారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఐపీఎస్‌లపైన కూడా...
సునీల్ కుమార్ గతంలో సీఐడీ డీజీగా పని చేశారు. గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాయత్నం చేశారని రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐడీ డీజీ సునీల్ కుమార్‌తోపాటు అతని బృందంలోని పలువురిపై సెక్షన్ 120బి,166,167,197,307,326,465,506(34) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని, ఐదుగురు ఆగంతుకులతో దారుణంగా హింసించి వీడియో తీసి అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చూపించారని రఘురామకృష్ణరాజు తెలిపారు. తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేసిన పరిస్థితి నెలకొందని, అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. జగన్, సునీల్ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. అప్పట్లోనే రఘురామ చేసిన ఆరోపణలు రాజకీయంగా సంచలనంగా మారాయి. న్యాయస్థానంలోనూ రఘురామ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ కేసు విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.