లింగ వివక్ష రూపుమాపే చర్యలు చేపట్టాలి

7/26/2024 10:44:12 PM

*బాలికల విద్యకు ప్రోత్సాహం అందించాలి

*స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణపై నిఘా ఉంచాలి

*జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశం

శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్: 
లింగ వివక్ష రూపుమాపే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బేటి బచావో - బేటీ పడావో పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సంబంధిత అధికారులుతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలపై నిఘా ఉంచాలన్నారు.  బాలికల విద్యకు ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులకు మరుగుదొడ్లు ఏర్పాటు తప్పనిసరిగా చేయాలని చెప్పారు. ఆర్టీసి కాంప్లెక్సు, రైల్వే స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో పాలిచ్చే తల్లులకు ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సెక్స్ రేషియో గూర్చి కలెక్టర్ డిఎంహెచ్ఓ ను అడుగగా గతంలో కంటే సెక్స్ రేషియో అభివృద్ధి ఉందని, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనదని, స్కానింగ్ సెంటర్లు వద్ద నిఘా ఉంచినట్లు ఆమె వివరించారు. డెలివరీకీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయిస్తారని చెప్పారు. ప్రతీ ఆసుపత్రి నుండి డెలివరీ డేటా ప్రతీ నెల వస్తాయన్నారు.  ఆడ పిల్లలు జననాలు తక్కువగా ఉన్న ఆసుపత్రుల పై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.   సుకన్య సమృద్ధి యోజన బ్యాంకు అకౌంట్లు గూర్చి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎల్డీయం సూర్యకిరణ్ చెప్పారు. బాలికలకు ఉన్నత విద్యకు ఎలాంటి పూచీ లేకుండా 7 లక్షల రూపాయలు వరకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. 
     మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి బి. శాంతి శ్రీ బేటీ బచావో - బేటి పడావో పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  కౌమార దశలో ఉన్న బాల బాలికలకులింగ సమానత్వాన్ని గుర్తించే విధంగా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. బాల్య వివాహాలు నివారించుటకు బాలికలకు వారి భవిష్యత్తు తీర్చిదిద్దుకొనే విధంగా శిక్షణ ఇవ్వాలన్నారు. శాఖల వారీగా బాలిక సంరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలు గూర్చి వివరించారు.  విద్యా ఫౌండేషన్స్ నుండి ప్రసాద్ మాట్లాడుతూ నాబార్డు సహకారంతో గ్రామీణ ప్రాంత యువతులకు వృత్తి నైపుణ్యం మరియు ఉపాధికల్పనా కార్యక్రమాలను నిర్వహించాలని బ్యాంకు రుణాలు ద్వారా వ్యవస్థాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ బిజినెస్ మేనేజ్ మెంట్ అనే సంస్థ ఆధ్వర్యంలో శిక్షకులను నియమించి కొన్ని పాఠశాలల్లో స్టెమ్ (సైన్స్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్) అనే కార్యక్రమం ద్వారా బాలికలకు కంప్యూటర్ విద్య, సైన్స్, టైక్నాలజి, ఇంజనీరింగ్ అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు సర్వశిక్ష అభియాన్ వారు వివరించారు.  ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, డిఆర్డిఎ పిడి కిరణ్ కుమార్, మెప్మా పిడి కిరణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ ఎటిడబ్ల్యూఓ శ్రీనివాసరావు, ఛైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి మీనాక్షి, సిపిఓ లక్ష్మీ ప్రసన్న, ఆర్ఐఓ దుర్గారావు, డిఈఓ వెంకటేశ్వరరావు, ఎసిపి జయ ప్రకాష్, ఎల్డీయం సూర్యకిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*