. రెండు నెలలపాటు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు
. లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్:
హెచ్‌ఐవి, లైంగికంగా సంక్రమించే ఇతర అంటువ్యాధుల గురించి సమాచారాన్ని అందించేందుకు, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రెండు నెలలపాటు నేకో (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ) నేతృత్వంలో ”మీకు తెలుసా ” పేరిట “ఇంటెన్సిఫైడ్ ఐఇసి క్యాంపెయిన్” కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తో కలసి సోమవారం ఉదయం జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో కార్యక్రమాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఆగస్టు 12 నుంచి రెండు నెలల పాటు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రముఖులు, విద్యావేత్తలు, ఉద్యోగులు, కమ్మూనిటీ ఛాంపియన్లు, విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి మీనాక్షి మాట్లాడుతూ జనాభాలో హెచ్ఐవి, సుఖ వ్యాధులు(ఎస్టీఐ) ల గురించి పరిజ్ఞానం, అవగాహన పెంపొందించండానికీ, సురక్షిత పద్ధతులు, హెచ్ఐవి ఉన్నవారి పట్ల వివక్ష తగ్గించేందుకు, ప్రజల్లో అవగాహన కలిగించి తద్వారా ఎక్కువ మంది హెచ్ఐవి పరీక్షలు చేసుకునేందుకు ముందుకొచ్చేలా నేకో ఆదేశాలకనుగుణంగా అవగాహనా కార్యక్రమాల్ని నిర్వహిస్తామని వివరించారు. రాష్ట్రంలో ఈ ఇంటెన్సిఫయిడ్ ప్రచార కార్యక్రమాన్ని మీకు తెలుసా? అన్న నినాదంతో ఎపి శాక్స్ చేపడుతోందని అన్నారు.
గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి హెచ్ఐవి ఎలా సోకుతుంది, ఎలా నివారించవచ్చు? వ్యాధి సోకినా వారి పట్ల ప్రేమతో కలసి మెలసి ఎలా జీవించాలనే విషయాల్ని తెలియజేస్తామని, గ్రామాధికారులు, విద్యార్థులు ఆరోగ్య కార్యకర్తలు ఈ సభల్లో పాల్గొంటారని, కళా ప్రదర్శనలు నిర్వహిస్తామని, సామాజిక మాధ్యమాలద్వారా వీడియోలు, మీమ్స్, వంటి వాటి ద్వారా అవగాహన కల్పిస్తామని, పట్టణాలలోని అతి జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటి-ఇంటి ప్రచారం చేస్తారని ఆమె వివరించారు. కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సహకారం అవసరమని ఆమె కోరారు.