*స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి
*నేడు స్పందనకి వచ్చిన దరఖాస్తులు 259
*జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్:
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ(మీకోసం) లో అందిన అర్జీలకు నాణ్యతతోకూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని, అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు.
సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ(మీకోసం) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన అహమ్మద్ ఖాన్ జిల్లా రెవిన్యూ అధికారి అప్పారావు, డిఆర్డిఎ, పి.డి కిరణ్, జిల్లా పరిషత్ సిఇఓ వెంకటేశ్వర రావు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ధరఖాస్తులను నాణ్యతతోపాటు నిర్ధేశించిన సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పిజిఆర్ఎస్ (మీ కోసం) నిర్వహణ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అందునిమిత్తం అర్జీల పరిష్కారానికి ఒక నిర్ణీత ప్రొఫార్మా ఇవ్వడం జరిగిందని ఆ ప్రొఫార్మాకిలోబడి అర్జీల పరిష్కారం చేపట్టాలని అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు.
జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను పరిశీలించి నాణ్యతతో వాటి పరిష్కారానికి సంబంధించిన అర్జీని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా, మండల కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ(మీకోసం) కార్యక్రమం అధికారుల సమక్షంలో నిర్వహిస్తారని చెప్పారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్ మెంట్ ఇవ్వాలని తెలిపారు.
ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వారికి అర్జీలు సమర్పించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ(మీకోసం) కార్యక్రమంలో 259 అర్జీలు స్వీకరించడం జరిగింది.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన (నా ఇంటిపై జండా ఎగురవేస్తాను) సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకం చేస్తున్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్, వివిధ శాఖల. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో కెఆర్సి ప్రత్యేక ఉప కలెక్టర్ సుదర్శనదొర, జిల్లా పంచాయతీ అధికారి వేంకట్వశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి బి.మీనాక్షి, డ్వామా పి.డి చిట్టి రాజు, ఎస్.ఇ కార్పొరేష్ ఇ.డి గడేమ్మ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.