కూటమి సర్కార్ కు ఉక్కు పరీక్ష

9/6/2024 10:25:41 PM

 కేంద్రం నిర్ణయం... కిమ్మనని నేతలు 
- ఓ వెైపు ఉద్యోగులపై వేటు 
- ఆందోళనలో కార్మికులు 

విశాఖపట్నం, ఎక్స్ ప్రెస్ న్యూస్;
ఏపీలో కొత్త ప్రభుత్వ సమర్ధతకు కొత్త పరీక్ష మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్లాంట్ ప్రయివేటీకరణ ఇప్పట్లో ఉండదని చెబుతూనే నిర్ణయాలు మాత్రం అమలు చేస్తున్నారు. తాజాగా ప్లాంట్ లో ఉద్యోగుల విషయంలో నిర్ణయాల పైన ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒకే సమయంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో, ఇప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది.

తాజా నిర్ణయాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు అనుగుణంగా ఒక్కో నిర్ణయం జరుగుతోంది. దీంతో 19 వేల పైచిలుకున్న స్టీల్‌ కార్మికుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 8 వేలకు దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో, ఉత్పత్తిపై ఇది తీవ్ర దుష్ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. కేంద్ర స్టీల్‌ మంత్రి కుమారస్వామి 2 నెలల క్రితం విశాఖకు విచ్చేసి అన్నీ 45 రోజుల్లో చక్కదిద్దబడతాయని, ప్లాంట్‌ ప్రయివేటీకరణ ప్రశ్నేలేదని ప్రకటించి వెళ్లారు. ఆ తర్వాత నుంచీ పరిణామాలు చూస్తే 2025 నాటికి 2500 మందికి విఆర్‌ఎస్‌ పేరుతో ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది.

ఉద్యోగుల కోత
ఇందుకోసం రూ.1260 కోట్లు సిద్ధం చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. నాగర్‌నార్‌ స్టీల్‌ప్లాంట్‌లో సాంకేతికంగా అనుభవజ్ఞులైన కార్మికులు లేరని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కార్మికులను పంపించాలని కేంద్రం కోరిన వెంటనే విశాఖ యాజమాన్యం 500 మందిని డిప్యుటేషన్‌పై పంపేయాలని నిర్ణయం చేయడం చూస్తే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఖాళీ అయిపోతుందన్నది వెల్లడవుతోంది. ప్లాంట్‌లోని 3 ఫర్నేస్‌లకుగానూ ఒక్కటే నడుస్తోంది. రోజుకు 21 వేల మిలియన్‌ టన్నులు ఉత్పత్తి కావాల్సి ఉండగా ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకూ రోజుకు 6 వేల టన్నులే ఉత్పత్తి అవ్వటం ఆందోళనకు కారణమవుతోంది.

మొదలైన ఆందోళన
వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 2 లక్షల టన్నుల కోల్‌ నిల్వలు ఇప్పటికీ గంగవరం పోర్టులోనే ఉండిపోయాయి. ప్లాంట్‌లోని ఆఫీసర్లకు జీతాల్లో 6 శాతం యాజమాన్యం కోత పెట్టేసింది. టౌన్‌షిప్‌లో ఉన్న కార్మికులు, ఉద్యోగులకు యూనిట్‌కి 40 పైసలు మాత్రమే వసూలు చేసే ఛార్జీలను ఇప్పుడు యాజమాన్యం రూ.8కు పెంచేసింది. 6 నెలల బకాయిలకు ఎపిఇపిడిసిఎల్‌ తాజాగా యాజమాన్యానికి లేఖ రాసింది. 19 వేల మంది కార్మికుల్లో ప్రస్తుతం 12500 మందికి కుదించగా 2500 మంది విఆర్‌ఎస్‌, 500 మంది డిప్యుటేషన్‌, ఈ ఏడాది చివర నాటికి 1400 మంది రిటైర్మెంట్‌తో ప్లాంట్‌ ఖాళీ అయిపోనుంది. ఈ పరిణామాల పైన ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది వేచి చూడాల్సిందే.

Name*
Email*
Comment*