వెంటాడుతున్న వరుణుడు

9/6/2024 10:27:53 PM


- మళ్లీ వ‌ర్షాలు మొదలు  
- బుడ‌మేరు ప్రాంతంలో వ‌ర్షాలు 

- వాతావ‌ర‌ణ శాఖ తాజా హెచ్చరిక

 ఏపీని వర్షాలు వీడటం లేదు. తాజా వర్షాలు..వరదలతో భారీగా ప్రాణ - ఆస్తి నష్టం జరిగింది. బుడమేరు ప్రాంతంలో మరోసారి వర్షం కురుస్తోంది. ఉదయం కంటే ప్రవాహం పెరిగింది. మరింత ప్రవాహం పెరిగితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సమీప లంక గ్రామాలకు సూచనలు అందుతున్నాయి. ఇటు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. మరోసారి వాతావరణ శాఖ వర్షాల పైన హెచ్చరిక చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సెప్టెంబరు 9 నాటికి వాయువ్య బంగాళాఖాతం, గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల పరిసర ప్రాంతాలలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. దీని కారణంగా కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉత్తరాంధ్రలోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. 

 తాజా ఆదేశాలు.. 

 ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రానున్న రెండు రోజులు వర్షాలకు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాయలసీమలోనూ నేటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. దీంతో, ప్రధానంగా బుడమేరు, కొల్లేరు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Name*
Email*
Comment*